అయిజ, నవంబర్ 21 : పాఠశాల, కళాశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శుక్రవారం అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దీపురం గ్రామంలోని అయిజ – కర్నూల్ అంతర్రాష్ట్ర రోడ్డుపై విద్యార్థులు, తల్లిదండ్రులు బైఠాయించారు. ఉదయం 8 గంటల నుంచి పర్దిపురం గ్రామంలోని బస్‌స్టాప్‌లో నిలిచి ఉన్నా కర్నూల్ వైపు నుంచి వచ్చే బస్సులను కొందరు డ్రైవర్లు, కండక్టర్లు నిలపకుండా పోతున్నారని వాపోయారు.
బస్సులు నిలపకుండా వెళ్లడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో స్టాప్ ఉన్న విషయమే కొందరు డ్రైవర్లు, కండక్టర్లు మర్చిపోయారని పేర్కొన్నారు. బస్సులు నిలుపని విషయం డీఎం, ఆర్టీసీ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. పాఠశాలలు, కళాశాలల సమయాలకు ప్రత్యేకంగా విద్యార్థుల కోసం బస్సులను ఏర్పాటు చేయాలని పలుమార్ల్లు విజ్ఞప్తి చేసినా ఆర్టీసీ అధికారులు స్పందించడం లేదని వాపోయారు.
శాంతినగర్, జులెకల్, వెంకటాపూర్, పర్దీపురం మీదుగా అయిజ వరకు ప్రత్యేకంగా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల రాస్తారోకోతో దాదా పు రెండు గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న అయిజ ఎస్సై శ్రీనివాసరావు, ఆర్టీసీ కంట్రోలర్ కృష్ణలు పర్దిపురానికి చేరుకుని విద్యార్థులు, తల్లిదండ్రులకు న చ్చచెప్పారు.
ఆర్టీసీ డీఎంతో ఎస్సై చర్చించి అన్ని బస్సు లు ఆపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. ఈ విషయమై గద్వా ల డీఎం సునీతను ఫోన్లో ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా కర్నూల్ వైపు నుంచి వచ్చే ప్రతి బస్సు పర్దీపురంలో నిలుపుతున్నామని తెలిపారు.
గ్రామంలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని, విద్యార్థులు అందరూ ఒకే సారి బస్సులను ఆశ్రయిస్తుండడంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. సమయానికి అనుగుణంగా కొంద రు విద్యార్థులు 8 గంటల నుంచి పాఠశాలలు, కళాశాలలకు వెళ్తే బాగుంటుందని, ప్రత్యేక బస్సులు నడిపేందుకు బస్సులు అందుబాటులో లేవని తెలిపారు. కా ర్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.