వనపర్తి టౌన్, నవంబర్ 30: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పండుగకు వనపర్తి జిల్లా నుంచి రైతులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు కేటాయించారు. అందులో భాగంగా వనపర్తి డిపోలో 110 బస్సులు ఉండగా.. అందులో 80 బస్సులు రైతు పండుగకే తరలించడంతో ఉదయం నుంచి ప్రయాణికులు, ఉద్యోగులు బస్సులు లేక పడిగాపులు కాయాల్సి వచ్చింది. పాఠశాల, కళాశాలలకు విద్యార్థులు కూడా రాలేదు. వనపర్తి జిల్లా కేంద్రానికి వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు చేరేందుకు ఇబ్బందులు పడ్డారు.
వనపర్తి జిల్లా నుంచి వివిధ మండలాలు, గ్రామాలకు బస్సులు రాకపోవడంతో ఆటోలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్టాండ్లో బస్సులు ఉండాల్సింది పోయి మీటింగ్కు వెళ్లడంతో బస్టాండ్ ప్రాం గణం ఖాళీగా దర్శనమిచ్చింది. ఉన్న బస్సుల్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరికొందరు ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో ఆటోలు, ప్రైవేట్ వాహనాలు దర్శనమిచ్చాయి. వనపర్తి డిపోలో బస్సుల కొనుగోలు చేపట్టకపోవడంతో ఉన్న బస్సులనే అదనపు ట్రిప్పులు తిప్పుతూ ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఆ కొన్ని బస్సులను మీ టింగ్లకు పంపడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురయ్యారు.