మూసాపేట, మార్చి 6 : బస్సు అదుపు తప్పి లారీని ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు ప్రయాణిలకు గాయాలైన ఘటన శుక్రవారం మూసాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై వేణు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సు శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్లింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి 28 మంది ప్రయాణికులతో మహబూబ్‌నగర్‌లో మెట్టుగడ్డకు చెందిన ఆర్టీసి డ్రైవర్ పురుషోత్తం, మూసాపేట మండలంలోని తుంకినీపూర్కు చెందిన డ్రైవర్ రాముగౌడ్ ఇద్దరూ డ్రైవర్లతో బయలుదేరినట్లు తెలిపారు. మార్గమధ్యలో జడ్చర్ల వద్ద భోజనం అనంతరం బయలు దేరినట్లు తెలిపారు.
ఆ సమయంలో డ్రైవర్ పురుషోత్తం(58) బస్సును నడుపుతున్నట్లు తెలిపారు. అయితే మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లి శివారు జాతీయ రహదారిపైకి రాగానే బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ దాటి కర్నూల్ రోడ్డు నుంచి హైదరాబాద్ వైపు రోడ్డుపై దూసుకెళ్లింది. ఆ సమయంలో కొత్తకోట వైపు నుంచి సిమెంట్ పైపుల లోడుతో వస్తున్న లారీని బస్సు వేగంగా ఢీ కొట్టింది. దీంతో వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని వడ్డెవాట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ నందిపేట రవి (35) కొత్తకోటకు చెందని నాగన్న (38) ఇద్దరూ అక్కడికి అక్కడే దుర్మరణం చెందారు. బస్సు నడుపుతున్న డ్రైవర్ పురుషోత్తంకు(58) కాలు విరిగిపోవడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అదేవిధంగా మరో డ్రైవర్ రాముగౌడ్కు కూడా గాయాలు అయ్యా యి.
అలాగే బస్సులో ఉన్న ప్రయాణికులు షేక్ రబ్బా నీ, శాయాదేవి, నాగేశ్వర్, విజయశాంతిలు ప్రథమచికిత్స చేయించుకొని వెళ్లిపోగా, శివకుమార్, వెంకటరామమ్మ, శాంతి, శిరీష, సురేశ్‌బాబులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మరి కొంత మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం తో జాతీయ రహదారిపై ఇరు వైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. విషయం తెలిసి పోలీసులు, ఎల్అండ్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో పాటు, ప్రయాణికులు, స్థానికులు శ్రమించి క్షతగాత్రులను మూడు అంబులెన్స్‌లతోపాటు, ఎల్అండ్టీ అంబులెన్స్‌లో జిల్లా దవాఖానకు తరలించారు. అయితే వారిలో 5 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి క్షతగాత్రు ల తరలింపుపై అధికారులకు సిబ్బందికి సూచనలు చేశారు. అదేవిధంగా క్షతగాత్రులతో మాట్లాడారు. మృతి చెందిన వారితో పాటు గాయపడిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాముగౌడ్ కూడా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబ సభ్యులతో మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడి ధైర్యం చెప్పారు.
ప్రమాదస్థలాన్ని ఎస్పీ జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం కవిత, డిపో ఆర్ఎం సంతోష్‌కుమార్, డీఎం అశోక్‌కుమార్, భూత్పూర్ సీఐ రామకృష్ణ, ఎస్సైలు వేణు, శ్రీనివాసులు పరిశీలించి ఈ ఘటనపై ఆరా తీశారు.