అమరచింత, జూన్ 29 : తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో ఉండాలని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వాడవాడలో తన గళం వినిపించి ప్రజలను ఏకంగా చేసిన దివంగత సాయిచంద్‌కు మరణం లేదని, సాయిచంద్ ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. అమరచింత మండలకేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయిచంద్ మూడో వర్ధంతి సభను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆయన సతీమణి రజనీ సాయిచంద్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న బిడ్డల ఆత్మఘోషపై పరమశివుడి పాటలతో ప్రశ్నించిన కళాకారుడు సాయిచంద్ ప్రసుత్తం బతికి ఉంటే తెలంగాణలో కొనసాగుతున్న రేవంత్ ఆరాచన పాలనపై మరోమారు ప్రశ్నించేవారని గుర్తు చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో నేలకొల్పిన సంక్షేమ కళాశాలలో ఎంతో మంది పేదపిల్లలు చదువుకొని దేశవిదేశాలలో నేడు దేశం గర్వించదగిన కొలువులు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చిన రాష్ట్ర పాలకుడు సంక్షేమ కళాశాలలో చదువుతోపాటు, తిండి కరువై మృతి చెందుతున్నా ప్రశ్నించే కళాకారులు లేరని అన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనలేకపోవడంతో కల్లాల వద్ద పురుగులు మందు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నా పాలకులు మాత్రం తమ పబ్బం గడుపుకొనేందుకు పాలన కొనసాగిస్తున్నారని ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాక్షస పాలన రాజ్యమేలుతుందని, ప్రశ్నించిన ప్రతిఒక్కరిపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
ప్రజావ్యతిరేకపాలనపై సాయిచంద్‌ను గుర్తు చేసుకొని ప్రజలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రజనీ సాయిచంద్ మాట్లాడుతూ మూడో వర్ధంతికి ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నామని, అందులో భాగంగా సాయిచంద్ గుర్తుగా 100మందికి రూ.10లక్షల వరకు జీవితబీమా పాలసీని కట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేతుల మీదుగా కొంతమందికి పాలసీ పత్రాలను అందజేశారు. అక్కడి నుంచి సాయిచంద్ విగ్రహం వరకు నడిచి వెళ్లి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజుసాగర్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు నర్సింహులుగౌడ్, రాజు, తోకలి రమేశ్, నాగభూషణంగౌడ్ పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కళాకారులు ప్రజలు, పాల్గొన్నారు.