అయిజ, మార్చి 28 : అయిజ పట్టణంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు జేపీ పెట్రోల్ మార్ట్ (పెట్రోల్ పంపు)లో హల్చల్ చేశారు. పట్టణంలోని రాయిచూర్, ఉత్తనూర్ చౌరస్తా, పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న పెట్రోల్ పం పులోకి గుర్తు తెలియని దుండగులు శుక్రవారం తెల్లవారు జామున 1:30 గంటల సమయంలో జేపీ పెట్రోల్ మార్ట్‌లోకి ప్రవేశించారు.
అర్ధరాత్రి కావడంతో గదిలో నిద్రిస్తున్న సిబ్బంది తిమ్మప్ప, అశోక్, భీమేశ్‌ను మారణాయుధాలు, ఇనుప రాడ్లతో బెదిరించి భయభ్రాంతులకు గురి చేశా రు. వారిని నగదును భద్రపర్చిన లాకర్ల తాళా లను ఇవ్వాలని లేనిచో చంపుతామని బెదిరించడంతో తాళాలు ఇచ్చారు. దుండగులు రూ. లక్ష నగదుతోపాటు సీసీ కెమెరాల ద్వారా రికార్డు అ యిన హార్డ్‌డిస్క్‌లను భద్రపర్చిన పెట్టెను ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. దుండగులు అక్కడి నుంచి వెళ్లి న వెంటనే సిబ్బంది పెట్రోల్ పంపు యజమాని బుగ్గారెడ్డికి సమాచారం అందించారు. ఆయన 100కు డయల్ చేయగా, పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
శాంతినగర్ సీఐ టాటాబాబు, ఎస్సై శ్రీనివాసరావులు తెల్లవారు జామున 2:30 గంటలకు చేరుకొని ఈ ఘటనపై ఆరా తీశారు. అనంతరం సీసీఎస్ ఎస్సై నాగేశ్వర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ రంజిత్‌లు చోరీ జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక దుండగులా, ఇ తర ప్రాంతాల నుంచి వచ్చిన దుండగుల పనేనా అని పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. యజమాని బుగ్గారెడ్డి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ టాటాబాబు వెల్లడించారు.
మల్దకల్, మార్చి 28 : మండలంలోని అమరవాయి గ్రామ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి దాడి చేయడంతోపాటు రూ. 1.40లక్షలు దోచుకెళ్లిన ఘటన చోటుచేసుకున్న ది. పెట్రోల్ బంక్ యజమాని గంగాధర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు గురువారం పెట్రోల్, డీజిల్ రాత్రి 10 గంటల వరకు వాహనదారులకు వేశామన్నారు.
అనంతరం బంక్‌లోని గదిలో సిబ్బం ది నిద్రించారన్నారు. సుమారు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో గదిలో నిద్రిస్తున్న సిబ్బందిని లేపారన్నారు. లేవకపోతే గది అద్దాలను పగులగొట్టి సిబ్బందిని కత్తులతో బెదించడంతోపాటు తీవ్రంగా కొట్టారు. అనంతరం వారి వద్ద పెట్రోలుకు సంబంధించిన రూ.లక్ష 40 వేలు లాక్కొని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌లను సైతం తీసుకెళ్లారు. ఈ ఘటననై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై నందికర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బంక్ యజమాని గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.