వనపర్తి టౌన్, మార్చి 29 : వనపర్తి జిల్లాలోని గోపాల్పేట మండలంలో దారిదోపిడీకి పాల్పడిన దొంగలను పట్టుకొని రూ.80వేల విలువ గల మొబైల్ ఫోన్, రూ.15వేల నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. గద్వాల పట్టణానికి చెందిన షేక్ అహ్మద్ తన స్నేహితులు కేటీదొడ్డికి చెందిన బోయ ఆంజనేయులు, రాంజీని తోడుగా తీసుకొని 26న విజయవాడకు తన సోదరుడి వద్దకు కారులో తీసుకెళ్లాడు. షేక్ అహ్మద్ మిర్యాలగూడలోని తన మేనమామ నవాజ్ వద్ద ఉన్న తమ్ముడు ఇర్ఫాన్‌ను కలిసి అతడి వద్ద ఉన్న రూ.80వేల విలువ గల ఐఫోన్‌ను తీసుకొని తిరుగు పయణమయ్యాడు.
కాగా, షేక్ అహ్మద్ వద్ద ఉన్న నగదు, ఐఫోన్‌ను కాజేయాలని కారులో అతనితో పాటు ఉన్న ఆంజనేయులు, రాంజీ పథకం పన్నారు. గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామంలో ఉంటున్న రామాంజనేయులు మామ రాజేశ్‌కు విషయం చెప్పారు. రాజేశ్ తన స్నేహితులైన విజయ్‌కుమార్, సల్మాన్, అశోక్‌ల సహాయంతో ఈ 27న షేక్ అహ్మద్ కారులో తిరుగు ప్రయాణం అవుతుండగా, బుద్ధారం నుంచి చిట్యాల రోడ్డులో వనపర్తి వెళ్తుండగా ఉదయం 3:30 గంటల సమయంలో స్కూటీపై అడ్డగించారు. షేక్ అహ్మద్ వద్ద గల రూ.15వేల నగదు, రూ.80వేల విలువ చేసే ఐఫోన్‌ను దొంగతనం చేశారు.
అనుమానం రాకుండా రామాంజనేయులు ఫోన్ కూడా లాగేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టి కాల్ డేటా ఆధారంగా నిందులను పట్టుకున్నారు. ఈ కేసులో 4 మొబైల్ ఫోన్లు, స్కూటీ, రూ.15వేలు, ఐఫోన్‌ను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదనలో కృషి చేసిన వనపర్తి సీఐ కృష్ణయ్య, గోపాల్పేట ఎస్సై గణేశ్‌కుమార్, షీటీమ్ ఎస్సై రామరాజు, కానిస్టేబుల్ శ్రీనివాసులు, ఆంజనేయులు, మురళి, సిబ్బందిని అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఉమా మహేశ్వరరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులున్నారు.