మరికల్ : వ్యవసాయ రంగంలో నానో యూరియా (Nano Urea ) ప్రాముఖ్యత రైతులకు ఎంతో ఉపయోగకరమని మరికల్ వ్యవసాయ శాఖ అధికారి మైసూర్ మెయిజుర్ రహమాన్ ( AO Rahman ) అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాంప్రదాయ యూరియా వాడకం వల్ల నేల, వాతావరణ కాలుష్యం, పోషక ఖర్చులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు.
ఈ సమస్యలను అధిగమించేందుకు నానోటెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేయబడిన నానో యూరియాతో విప్లవాత్మక పరిష్కారం లభిస్తుందని అన్నారు. నానో యూరియా 20-50 నానోమీటర్ల పరిమాణంలో ఉన్న నైట్రోజన్ కణాల ద్రవ రూపం. ఇది సాంప్రదాయ యూరియా కంటే 10,000 రెట్లు ఎక్కువ ఉపరితల వైశాల్యం కలిగి తక్కువ మోతాదులో ఎక్కువ నత్రజని అందిస్తుందని పేర్కొన్నారు. దీనిని పిచికారి చేస్తే నత్రజనిని తక్కువగా వాడి ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.
ఒక ఎకరాకు 500 మి.లీ నానో యూరియా వేయడం ద్వారా పంటకు కావలసిన నత్రజని సమర్థవంతంగా అందిస్తుందని వివరించారు. మొక్కల ఆకు ద్వారా కణాలు సులభంగా రవాణై శీఘ్రమైన శోషణకు కారణమవుతాయని తెలిపారు. సాంప్రదాయ యూరియాతో పోల్చితే లోతుగా నిల్వ కావడం లేదా వాయు రూపంలో నత్రజని ఆవిరి తక్కువగా ఉంటుందన్నారు. దీని వలన పంట దిగుబడులు 10 నుంచి 20 శాతం ఎక్కువగా పెరుగుతాయని తెలిపారు.
పత్రహారితం మెరుగుపడి, కిరణజన్య సంయోగ క్రియ సామర్థ్యం పెరుగుతుందని వెల్లడించారు. పంట నాణ్యత, ఆకుల ఆరోగ్యం, పండ్ల మెరుగుదలలో సహకరిస్తుందని తెలిపారు. నేల, నీరు, గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో, పర్యావరణ హిత వ్యవసాయానికి నానో యూరియా ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. చీడుపీడలు, తెగుళ్ల వేగాన్ని తగ్గిస్తుందని , నిల్వ, రవాణా సౌకర్యంతో రైతులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
వాడే విధానం..
నానో యూరియా వాడే విధానాన్ని అధికారి రహమాన్ వివరించారు.
పంట క్రియాశీల వృద్ధి దశలో మూడుసార్లు (30-35 రోజుల్లో లేదా మార్పిడి తర్వాత 20-25 రోజుల్లో) ఒక లీటరు నీటిలో 2-4 మి.లీ నానో యూరియా కలిపి పిచికారి చేయాలి. ఇది అన్ని పంటలకు, అన్ని రకాల నేలలకు వర్తిస్తుంది. నానో యూరియాలో ఉండే నైట్రోజన్ (నత్రజని )కణాలు చిన్న పరిమాణంతో ఉండి నేల నుంచి గాలి, నీటిలో పోషకాల లీచింగ్, ఉద్గారాలు తగ్గుతాయి. దీని వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గి, వాతావరణ మార్పులపై ప్రభావం తక్కువవుతుందని పేర్కొన్నారు.
నానో యూరియా వ్యవసాయ రంగంలో నూతన దశను తీసుకొస్తోందని తెలిపారు. తక్కువ నత్రజని వాడకం, పెరిగిన దిగుబడి, పర్యావరణ రక్షణ, రైతుల ఆదాయ పెరుగుదలకు ఇది సహాయం చేస్తోంది. సాంకేతికత పర్యావరణ అనుకూలతతో సమగ్ర వ్యవసాయాభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు.
యూరియా కొరత లేదు..
మరికల్ మండలంలో యూరియా ఎరువుల కొరత లేదని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారి స్పష్టం చేశారు. 2025 ఏప్రిల్ నుంచి ఆగస్టు 23 వరకు మొత్తం 1,309 మెట్రిక్ టన్నులకు గాను ఇప్పటి వరకు 29,000 బస్తాల యూరియా రైతులకు పంపిణీ చేశామని వివరించారు. గత సంవత్సరం కంటే 10వేల బస్తాలు అదనంగా పంపిణీ చేశామని తెలిపారు. రైతులు తమ పంట అవసరానికి సరిపడినంత మాత్రమే యూరియా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకొని నిల్వ చేసి ఉంచడం వల్ల ఇతర రైతులకు ఇబ్బందులు కలుగుతాయని అన్నారు. రోజువారీగా కొత్తగా యూరియా నిల్వలు మండలంలోని విక్రయ కేంద్రాలకు చేరుతున్నాయన్నారు.