మహబూబ్నగర్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చుట్టూ పచ్చని పొలాల మధ్య.. ఇథనాల్ కంపెనీ చిచ్చు రేపింది. కూత వేటు దూరంలో తుంగభద్ర నదీతీరం సమీపంలో కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఇచ్చిన అనుమతి పెద్ద దుమారమే రేపింది. ఇందుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించినా.. రాజకీయ నేతల వత్తిళ్లతో ఆంధ్రాకు చెందిన ఓ కంపెనీకి ఒప్పందం కుదుర్చుకొని.. కంపెనీ ఏర్పాటుకు బలవంతంగా చేసిన ప్రయత్నాన్ని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి రైతాంగం అడ్డుకున్నది. పథకం ప్రకారం అధికార యంత్రాంగంతోపాటు పోలీస్ యంత్రాంగం కూడా కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై రైతులను నిర్బంధించి బలవంతంగా కంపెనీ పనులు చేపట్టడానికి వెళ్తూ అకారణంగా రైతులపై దాడులకు దిగిన విషయం విదితమే.. పోలీసులను అడ్డం పెట్టుకొని కంపెనీ ప్రైవేట్ సైన్యం భూమి పుత్రులపై దాడులకు తెగబడింది. ఈ ఘటనతో రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడతోపాటు 12 గ్రామాల రైతులు తిరగబడ్డారు. కడుపుమండిన రైతులు, ప్రజల హాని చేసే ఫ్యాక్టరీ మాకొద్దంటూ ఆందోళన ఉధృతం చేశారు.
వద్దన్నా పనులు చేస్తుండడడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. దీంతో పెద్ద ధన్వాడ ప్రాంతం దద్దరిల్లింది. 3వేల మంది కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతానికి చేరుకొని సామగ్రిని ధ్వంసం చేశారు. దీంతో అక్కడి సిబ్బంది పరారయ్యారు. అయితే ఉల్టా రైతులపైనే కేసులు నమోదు చేసి పోలీసు యంత్రాంగం అణిచివేసే ప్రయత్నం చేసింది. తమ ప్రాణాలు పోయినా భవిష్యత్ తరాలకు మరణశాసనం రాసి ఈ కంపెనీ మాకొద్దంటూ.. చేసిన పోరాటానికి ‘నమస్తే తెలంగాణ’ బాసటగా నిలిచింది. ఈ కంపెనీ నిర్మాణం వెనుక జరిగిన కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ బయటపెట్టి రాజోళి రైతుల గొంతుకై నిలిచింది. దాదాపు ఆరు నెలల పోరాటం తర్వాత రాజోళి మండలం పెద్ద ధన్వాడ, చిన్నధన్వాడ గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ కంపెనీని రద్దు చేస్తూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో పలు గ్రామాల రైతులు, ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇక్కడి రైతులు చేసిన రాజీలేని పోరాటానికి ప్రభుత్వం దిగి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులపై పెట్టిన అక్రమ కేసులను కూడా తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.