నాగర్‌కర్నూల్, జూన్ 18 : తెలంగాణ రాష్ట్రం అసమర్థుల పాలనలో ప్రమాదంలో పడిందని, ప్రమాదాన్ని ముందుగా పసిగడితేనే మనుగడ ఉంటుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్‌లో నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీఆర్ఎస్కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి మాజీమంత్రితోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆతర్వాత కేసీఆర్ సారథ్యంలో ఎంతో అభివృద్ధి చెందగా చం ద్రబాబు నాయుడు శిష్యుడైన సీఎం రేవంత్‌రెడ్డి సా రథ్యంలో ప్రమాదంలో పడిందని విమర్శించారు. కర్ణాటక రాష్టం కృష్ణానదిపై మూడు కొత్త ప్రాజెక్టులను తాగునీటి ప్రాజెక్టుల పేరా నిర్మిస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం ప్రయోజనాలకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ సహకరిస్తుందని విమర్శించారు. నీటి వివాదాలు ఇతర అంశాలను నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్రస్థాయి మండిపడ్డారు.

రాబోయేది కేసీఆర్, కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ సర్కారేనని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు మరింత పురోగాభివృద్ధి సాధించడమే కాకుండా కృత్రిమ మేధస్సు, ఉద్యోగాలు రాబోతున్నాయని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో దళిత బిడ్డలు గురుకులాల్లో విద్యనభ్యసించి యుద్ధ విమానాల పైలెట్‌గా కావ్య అనే విద్యార్థిని ఎంపిక కావడం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేద బిడ్డలకు ఉన్నత విద్యను అందించడమే కారణమని అభివర్ణించారు. సర్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును నమోదు చేసేలా నెలరోజులపాటు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
బీహార్, బెంగాల్ వంటి రాష్ర్టాలలో బూతుకు 40నుంచి 50 వేల ఓట్ల చొప్పున తొలగించి పెద్ద ఎత్తున కుట్రకు పాల్పడ్డారని విమర్శించారు. తమిళనాడులో స్టాలిన్ నియోజకవర్గంలో 41వేల ఓట్లను సర్పేరుతో తొలగించడం జరిగిందన్నారు. స్టాలిన్ కేవలం 8వేల ఓట్లతో ఓడిపోయారంటే అక్కడ సర్ పేరుతో ఎంత కుట్ర జరిగిందో స్పష్టమవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆంధ్రాలో కుట్రకు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు నాయుడు సేవామిత్ర అనే ఒక వెబ్‌సైట్‌ను సృష్టించి గడపగడపకు వెళ్లి ప్రజలను కలిసి ఆసైట్లో పొందు పర్చడం జరిగిందన్నారు.
ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకొనే క్రమంలో టీడీపీ ఇతర పార్టీలపై సుముఖంగా ఉన్న వారిని గుర్తించి 30 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తెలంగాణలో ఆయన శిష్యుడే సీఎంగా ఉన్నాడని, ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి బీఎల్వోలే బీఎల్ఏలుగా అవతారం ఎత్తే అవకాశాలు ఉన్నాయని ఆర్ఎస్పీ విమర్శించారు. భువనగిరి బీజేపీ నేత ధర్మపురి అరవింద్ ఓ సందర్భంలో మాట్లాడుతూ తెలంగాణలో తాము తొండి చేసైనా… మొండి చేసైనా… పొర్లి దొర్లయినా సరే అధికారంలోకి వస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇలాంటి ముంచుకొచ్చే ప్రమాదాలను ముందుగానే పసిగడితే మనం కూడా సాధించడం సాధ్యమవుతుందన్నారు.

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వాలను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. అజాగ్రత్తగా ఉంటే ఓట్ల గల్లంతు ఖాయమన్నారు. బీఆర్ఎస్ సానుభూతి పరులుగా వారి దృష్టికి వస్తే వారి ఓట్లను తొలగించే కుట్ర జరగవచ్చని అభిప్రాయపడ్డారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు కృష్ణానదిలో నీటి దోపిడీకి పాల్పడుతున్న అంశాలను తెలంగాణ రాష్ట్ర పాలకుల తీరును తీవ్రస్థాయిలోఎండగడుతూ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. సర్, సభ్యత్వ నమోదు ఇన్చార్జీలు మహ్మద్ జహంగీర్, మెట్టు శ్రీ నివాసులు కార్యకర్తలకు ఓటరు నమోదు, తొలగిం పు, మార్పులు, చేర్పులు వంటి అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.
సర్‌లో బీఎల్ఏల పాత్ర గురించి వివరించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో క్రియాశీలక సభ్యత్వాలు, సాధారణ సభ్యత్వాలు తదితర అంశాలపై కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బైకాని శ్రీనివాస్‌యాదవ్, పార్టీ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి జహంగీర్‌పాషా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీలు శ్రీశైలం, బాలగౌడ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ హన్మంతురావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్బాబురావు, కౌన్సిలర్లు పాండు, గంగాధర్, అర్జునయ్య, ప్రకాశ్, నాయకులు అర్థం రవి, ప్రదీప్, పులెందర్, ఆయా మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటానని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. 20రోజుల తర్వాత ప్రతి గ్రామానికి ఒక రోజు కేటాయించి ప్రతి కార్యకర్త ఇంటికి పోయి వారి యోగక్షేమాలు, ఆర్థిక స్థితిగతులను తెలుసుకుంటానన్నారు. వారి పిల్లల చదువులు, భవిష్యత్‌పై దృష్టిపెడతానని, తనకు అండగా ఉన్న కార్యకర్తలకు ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని రాబోయే రోజుల్లో వారికి న్యాయం చేసేలా తన కార్యాచరణ ఉండబోతుందన్నారు. సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి నిజమైన కార్యకర్తలతో సభ్యత్వ నమోదు చేయించాలని, మోసం చేసే వారిని దూరం పెట్టాలన్నారు. పార్టీకోసం పనిచేసే వారికి క్రియాశీల సభ్యత్వాన్ని, ఓటరుకు సాధారణ సభ్యత్వాన్ని అందజేయాలని గుర్తు చేశారు.
ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్తు అంతా మనదేనని మర్రి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చి అన్ని అనుభవించి అధికారం పోయాక కడుపుమీద తన్ని అధికారం కోసం పాకులాడే నాయకులు కాదు మనకు కావాల్సిందని, అధికారం లేనప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకోసం రేపటి గెలుపు కోసం కొట్లాడే కార్యకర్త నాకు కావాల్సిందన్నారు. పార్టీని నిలబెట్టడానికి చెమటోర్చే ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానన్నారు. ఒక ఇంటికి పునాధి ఎంత ముఖ్యమో పార్టీ కార్యకర్త అంతే ముఖ్యమన్నారు.
వలస లీడర్ల వల్ల పార్టీకి నష్టం జరిగిందని, ఇక నుంచి అలా జగదన్నారు. ఎవరినైనా పార్టీలోకి తీసుకోవాలంటే ఓ కమిటీ వేసి వారి నిర్ణయం మేరయే పార్టీలో చోటు ఉంటుందన్నారు. అనంతరం అమలు కానీ హామీ ఇచ్చి అధికారంలోకి వచి రైతులను, ప్రజలను, అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మర్రి జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు.