అమరచింత, డిసెంబర్ 22 : కరువు జిల్లాగా పేరుగాంచిన పాలమూరు గడ్డపై పుట్టిన బిడ్డను తనను సీఎంగా చేసిన ప్రజల రుణం తీర్చుకునేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల ను పూర్తి చేసి రెండు పంటలకు సాగునీరు పారిస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డితోపాటు జిల్లాలోని ఇద్దరు మంత్రులకు సాగునీటి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని మక్తల్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
సోమవారం వారు ఆత్మకూర్‌లో బీఆర్ఎస్ నాయకులు రవికుమార్‌యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి మాట్లాడుతూ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ హయాంలో 90శాతం పూర్తి చేసి కర్వేన అంచుల వరకు సాగునీటిని తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయగా, అధికారం చేపట్టి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు దాటినా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ మిగిలిన ఉన్న పదిశాతం పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించలేదని వారు విమర్శిం చారు.
కొడంగల్ నియోజక్గవర్గంలో కొత్తగా చేపడుతున్న పేట, కొడంగల్ ప్రాజెక్టుకు ఇప్పటీ వరకు కనీసం డీపీఆర్ లేదని, కానీ ప్రాజెక్టు పనులపై ఇప్పటికే రూ.700 కోట్ల నిధులు ఖర్చుపెట్టి సొరంగమార్గంలో పైపులైన్ తీస్తున్నారని అన్నారు. సాగునీటి అవకాశం లేని ప్రాజెక్టుకు ఇంత ఖర్చు అవసరమా అంటే, ఒకే ఒక్క టీఎంసీ నీటి ప్రాధాన్యం కలిగిన భీమా ప్రాజెక్టు నుంచి, జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా పైపులైన్ వేసి పేట, కొడంగల్ ప్రాజెక్టుకు నాలుగు టీఎంసీల నీటిని తరలిస్తామని సమాధానం చెప్పడంపై సాగునీటి ప్రాజెక్టుపై వీరికి ఏమాత్రం అవగాహన ఉందో అర్థం అవుతుందని, వారికి సాగునీటి ప్రాజెక్టులపై ఉన్న అవగాహనను కప్పిపుంచుకునేందుకు నిత్యం మాజీ సీఎం కేసీఆర్‌పై అర్థం, పర్థం లేని ఆరోపణలు చేస్తుంటారని మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ఈప్రాంత రైతుల అవసరాలను పక్కకు పెట్టి తను ప్రాతినిధ్యం వహించే కొడంగల్ ప్రజల అవసరాల కోసం భీమా ప్రాజెక్టు నుంచి పేట, కొడంగల్ ప్రాజెక్టుకు సాగునీటిని తరలిస్తే మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని రైతుల భూములు ఎడారిగా మారుతాయని, అలా చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తు ఉరుకోదని, రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటుందని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్తోపాటు ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట, వనపర్తి మండలాల బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.