మహబూబ్‌నగర్, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక ప్రజాప్రతినిధుల శాసనమండలి ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరో 24 గంటల్లో ఫలితం వెలువడనుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయగా రిటర్నింగ్ అధికారి రవినాయక్, ఎస్పీ హర్షవర్ధన్ పరిశీలించారు. బ్యాలెట్ పత్రాలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను తనిఖీ చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవనుండగా.. అంతకుముందు ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూం తెరిచి బ్యాలెట్ బాక్స్‌లను టేబుళ్ల వద్దకు తీసుకొస్తారు. ఐదు టేబుళ్లలో రెండు రౌండ్లలో ఫలితాన్ని లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లా కేంద్రంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఫలితంపై ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ధీమాతో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 1,439 ఓట్లకు గానూ 1,437 పోలయ్యాయి. మార్చి 28న పోలింగ్ జరుగగా ఏప్రిల్ 2న ఫలితాలు వెలువడాల్సి ఉండగా.. ఎన్నికల సంఘం నిర్ణయంతో జూన్ రెండుకు వాయిదా పడింది.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శాసనమండలి ఎన్నికల ఫలితం రెండు గంటల్లోనే వెలువడనున్నది. మొ త్తం ఐదు టేబుళ్లను వినియోగించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ బాక్స్లవారీగా టేబుళ్లకు తరలిస్తారు. పోలైన ఓట్లకు, బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న పత్రాలకు లెక్క సరిచూసి ఓట్ల లెక్కింపును చేపడతారు. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రాధాన్యత ప్రకారం ఓట్లు లెక్కించే ప్రక్రియను చేపడుతారు. మొ దటి ప్రాధాన్యతా ఓటులో ఓటింగ్ సరళికి సరిపడా పర్సంటేజ్ ఓట్లను ఏ అభ్యర్థి అయితే పొందుతారో అతడిని గెలిచినట్లు ప్రకటిస్తారు. కాగా ఒక్కోసారి మొదటి ప్రాధాన్యతా ఓట్లతో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తారు. ఇందులో ఎవరికి ఎక్కువ వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. లెక్కింపులో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల సిబ్బందిని రిటర్నింగ్ అధికారి ఆదేశించారు.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు 66 రోజుల తర్వాత జరుగనున్నది. మార్చి 28న పోలింగ్ జరుగగా.. ఏప్రిల్ 2న ఫలితాన్ని లెక్కించాల్సి ఉన్నది. కానీ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఫలితాన్ని వాయిదా వేసి రెండు నెలల తర్వాత లెక్కింపు చేయనుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. కాగా ఎన్నికల్లో గెలుపోటములపై బెట్టింగ్ జోరుగా సాగుతున్నది.
ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరుగనున్న మహబూబ్‌నగర్ స్థానికసంస్థల నియోజకవర్గ శాసనమండలి ఉపఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి జి.రవినాయక్, ఎస్పీ హర్షవర్ధన్‌తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు ఉన్నారు.