మదనాపురం, మార్చి 18 : తాగునీటి సమస్యలను పరిష్కరించాలని మండలంలోని కొన్నూరు గ్రామం బుడగ జంగాల కాలనీవాసులు డిమాండ్ చేశారు. 200 వందల కుటుంబాలు ఉన్న కాలనీలో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటిని సరఫరా చేయాలని కోరుతూ మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది కిరణ్ మాట్లాడుతూ ఒకరోజు అన్నం లేకు న్నా మనిషి బతుకుతాడేమో కానీ.. నీరు లేకుంటే మనిషి బతకడం కష్టం అన్నారు. కాలనీ వాసులతో పాటు మూగ జీవాలకు కూడా నీరు దొరకడం లేదని విచారం వ్యక్తం చేశారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం ప్రజలు గ్రామ సమీపంలోని పంట పొలాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని, తెచ్చుకొనే క్రమంలో రైలు పట్టాలు దాటాల్సి వస్తుందని, దీంతో ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని తెలియడం లేదన్నారు. కాలనీలో ఉన్న మినీ వాటర్ ట్యాంకులో మిషన్ భగీరథ నీళ్లతోపాటు బోరు నీళ్లు కలిపి వదలడం వలన ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని, తక్షణమే అదనంగా మరో ట్యాంకు ఏర్పాటు చేసి కాలనీకి సరిపడా తాగునీటిని సరఫరా చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాలనీవాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.