నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో ఎస్ఎల్బీసీ (SLBC ) టన్నెల్ ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతు న్నాయని టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి (Shivshankar Loteti) తెలిపారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ 1 ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సహాయక బృందాల ఉన్నతాధికారులకు పలు సూచనలు, సలహాలు ఇస్తూ రెట్టింపు సహాయక సిబ్బంది తో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా సహాయక బృందాలకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబాలతో జరుపుకోవాల్సిన పండుగలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు . ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న మట్టి తవ్వకాలు ప్రతి రోజూ 20 మీటర్ల మేర చేపడుతూ, స్టీలు భాగాలను కత్తిరిస్తూ టన్నెల్ బయటికి తరలిస్తున్నట్లు వెల్లడించారు. ని
రంతరాయంగా వస్తున్న ఊట నీటిని అత్యధిక సామర్థ్యం గల మోటార్ పంపుల ద్వారా బయటికి పంపింగ్ చేస్తున్నట్లు వివరించారు. ప్రమాద ప్రదేశంలో జీఎస్ఐ, నీటి పారుదల శాఖ అధికారులు నిరంతరం పరిశీలిస్తూ సహాయక బృందాలకు అవసరమైన సూచనలు, సలహాలు అందజేస్తున్నారని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే సహాయక సిబ్బంది నిరంతరం స్టీల్‌ను కత్తిరించే పనులు చేపడుతూ మట్టి తవ్వకాలకు అనుగుణంగా కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో, ఆర్మీ అధికారులు, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్ కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, తదితరులు పాల్గొన్నారు.