అచ్చంపేట : దోమలపెంట ఎస్సెల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. 20వ రోజు గురువారం రెస్క్యూ బృందాలు లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్లాయి. గురువారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్‌లో సహాయక చర్యలపై డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సహాయక చర్యల పురోగతిని సమీక్షించి, తదుపరి చర్యలపై చర్చించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహాయక బృందాలతో ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తూ ఏ రోజుకు ఆ రోజు చేయవలసిన పనులను అధికారులు సహాయక బృందాలకు వివరిస్తున్నట్లు తెలిపారు. సహాయక బృందాలు ఎస్సెల్బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ను 24 గంటలు నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఎస్సెల్బీసీ టన్నెల్ ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా కట్టర్స్, థర్మల్ కట్టర్స్ బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ ప్లాట్‌ఫామ్‌ను కత్తిరించే పనిలో నిమగ్నమై ఉన్నట్లు వివరించారు.
టన్నెల్ బోరింగ్ మిషన్ ప్లాట్‌ఫామ్ కటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు, ప్రమాద ప్రదేశంలో తవ్వకాలు జరుగుతున్న డి-1, డి-2 ప్రాంతాల్లో సింగరేణి ర్యాట్ మైనర్స్ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నట్లు తెలియజేశారు. టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యల్లో టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలను తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యల్లో రోబో వినియోగం తదితర పనులు కూడా కొనసాగుతున్నట్లు తెలియజేశారు. డి-1, డి-2 ప్రదేశాలకు మరోసారి కేరళకు చెందిన కడవర్ డాగ్స్ స్క్వాడ్లను పంపినట్లు తెలిపారు.
నిరంతరాయంగా డీ-వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్, కడవర్ డాగ్స్, హైడ్రా, అన్వి రోబోటిక్స్, బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు, టన్నెల్ లోపల సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో అన్వి రోబోటిక్స్, హైడ్రా అధికారులు, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీమ్, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే సహా సహాయక చర్యల్లో పాల్గొంటున్న అన్ని బృందాల అధికారులు హాజరయ్యారు.