అయిజ, ఫిబ్రవరి 21 : తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు మంగళవారం నీటి విడుదల పెంచారు. మార్చి ఒకటో తేదీ వరకు 1.399 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ జలవనరుల శాఖ ఈఎన్సీ మురళీధర్ తుంగభద్ర బోర్డుకు లేఖ రాశారు. ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలతో యాసంగిలో సాగు చేసిన పంటలకు త దుపరి ఇండెంట్లో మార్చి 15 వరకు నీటిని అందించేందుకు నీటిపారుదల శా ఖ ప్రణాళికలు రూపొందించింది. అందు లో భాగంగా ఆర్డీఎస్ ఆయకట్టుకు కేటాయించిన 5.770 నీటిని టీబీ డ్యాం ద్వారా విడుదల చేయిస్తున్నారు. ప్రస్తు తం తుంగభద్ర నదిలో నీటి లభ్యత అంతంత మాత్రం ఉండటంతో తుమ్మిళ్ల పథకం పంపింగ్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో రైతులు పంటలు ఎండుతున్నాయని ఎమ్మెల్యే అబ్రహం దృష్టికి తీసుకెళ్లగా.. కర్నూల్ ఎస్ఈ రెడ్డి శేఖర్‌రెడ్డితో మాట్లాడి కేసీ కెనాల్ విడుదల చేస్తున్న కొంత మేరకు నీటి తగ్గించుకుంటే తుమ్మిళ్ల పంపింగ్‌తో ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటి అందిస్తామని కోరారు. దీంతో కేసీ కెనాల్ నీటిని తగ్గించడంతో ఐదు రోజులపాటు పంపింగ్ చేశారు.
ప్రస్తుతం నది నీటి లెవల్స్ పడిపోవడంతో తుమ్మిళ్ల పంపింగ్ నిలిపివేశారు. 15వ తేదీ నుంచి ఆర్డీఎస్ ఇండెంట్‌కు టీబీ డ్యాం ద్వారా నీటిని విడుదల చేస్తున్నప్పటికీ ఆనకట్టకు నీరు చేరడంలో ఆలస్యమవుతున్నది. దీంతో నీటి విడుదల పెంచాలని ఎమ్మెల్యే అబ్రహం జలవనరుల శాఖాధికారులను కోరారు. జా యింట్ ఇండెంట్ విడుదలతో ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీరు పుష్కలంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీఎస్ ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రెండు రోజుల్లో ఆనకట్ట ఓవర్‌ఫ్లో అవుతుందని, నదిలో నీటి లభ్యత మేరకు మూడ్రోజుల్లో తుమ్మిళ్ల పంపును పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం డీ-19 వరకు సాగునీరు చేరుతుందని, తుమ్మిళ్ల పంపు ప్రారంభిస్తే డీ-27 వరకు అందుతుందన్నారు. రైతులు ఆందోళన చెందకుండా నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చి 15 వరకు సాధ్యమైనంత నీటి విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైతే ఏపీ మంత్రి, జలవనరుల శాఖాధికారులతో మాట్లాడుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారని ఈఈ వెల్లడించారు.