ఈసారి వర్షాలు బాగానే పడ్డాయి. నీటిని నిల్వ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కృష్ణా నది నుంచి నీటిని కోయిల్‌సాగర్‌కు తరలించడంతోపాటు గొలుసుకట్టు చెరువులను నింపితే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇటు కోయిల్‌సాగర్ నింపక.. అటు చెరువులకు నీళ్లు మళ్లించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కేవలం వర్షాలతోని సాగర్ నిండింది. కానీ వందలాది చెరువుల్లోకి నీళ్లు చేరకపోవడంతో కాలం మంచిగా అయిందని భావించిన రైతులు ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. చివరి నిమిషంలో నీళ్లన్నీ విడుదల చేయకుండా తాత్సారం చేయడంతో పంటలు ఎండే పరిస్థితి వచ్చింది. ఎకరా ఎండినా ప్రభుత్వానిదే బాధ్యత.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దేవరకద్ర : పాలమూరు జిల్లాలోని మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. రెండున్నర టీఎంసీలు నిల్వ ఉండే ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం అర టీఎంసీ నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. దీంతో సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం నెలకొన్నది. ఒకవైపు సాగర్‌లో నీళ్లు ఫుల్‌గా ఉండడంతో రైతులు యాసంగిలో పంటలు పెద్ద ఎత్తున సాగు చేశారు.
ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైంది. మరోవైపు ఎండాకాలంలో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథకు ఈ నీటిని మళ్లిస్తారు. కాగా ప్రస్తుతం సాగర్ డెడ్ స్టోరేజీకి చేరడంతో ఇటు రైతుల్లో.. అటు ప్రజల్లో సందిగ్ధం నెలకొన్నది. చివరి తడికి వారం రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు ఊకచెట్టు వాగు ఎండిపోవడంతో పరీవాహక ప్రాంత రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది.
13.2 అడుగుల నీటిమట్టం
కోయిల్సాగర్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ ట్టం 32 అడుగులు కాగా.. మంగళవారం నాటికి 13.2 అడుగులుగా నమోదైంది. ప్రాజె క్టు ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులకు అధికారులు ఇప్పటివరకు ఐదు విడుతలుగా నీటిని వదిలారు. ప్రస్తుతం ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని ప్రాజెక్టు ఈఈ ప్రతాప్‌సింగ్ ‘నమస్తే తెలంగా’కు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
నిల్వ ఉన్న నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం ఉంచినట్లు చెప్పారు. అయితే మరోసారి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తే పలు ఎకరాల్లో పంటలు చేతికందుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. కానీ అధికారులు సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు. ఈ ఏడాది ధికంగా వర్షపాతం నమోదైనా.. కోయిల్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకునీటిని విడుదల చేసినా సర్కారుకు ముందుచూపు లేకపోవడంతో సాగరం వెలవెలబోతున్నది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
ఆయకట్టు ప్రశ్నార్థకం
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి అయోమయంగా తయారైంది. రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల కింద వందలాది ఎకరాలు సాగయ్యాయి. కానీ నీటి లభ్యత తగ్గిపోవడంతో అధికారులు వారంబంది పద్ధతిలో పంటలకు నీటిని విడుదల చేశారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితులు. ఇప్పటికే నీళ్లందక పంటలు ఎండిపోయాయి. మరోవైపు విద్యుత్ కోతలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయకట్టు రైతుల పరిస్థితి ఇలా ఉంటే.. వాగు పరీవాహక ప్రాంతాల్లో పంటలు సాగుపై అనిశ్చితి నెలకొన్నది. నీళ్లు అందక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది.