Mahabubnagar | మహబూబ్ నగర్: రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నాడు జరిగిన కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడం, ప్రజల్లో ఆర్థిక అవగాహనను పెంచడం ఈ వారోత్సవాల ముఖ్య లక్ష్యమని తెలిపారు. పొదుపు చేసే మహిళ.. సాధిస్తుంది ఘనత అనే అంశంపై ఈ ఏడాది వారోత్సవాల్లో సెమినార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కల్వ భాస్కర్ మాట్లాడుతూ.. మహబూబ్నగర్ జిల్లాలో గ్రామ గ్రామాన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా మహిళా మండలి, మహిళా వ్యాపారవేత్తలు, సాధారణ గృహిణులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ మూడు కేటగిరీలకు చెందిన మహిళలు ఎలా పొదుపు చేయాలి? అప్పు తీసుకుంటే రుణం ఏ సంస్థల నుంచి తీసుకోవాలి? ప్రభుత్వ సంస్థల ద్వారానే రుణాలు తీసుకోవాలని.. ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి రుణాలు తీసుకుంటే అధిక వడ్డీలు వసూలు చేస్తారని, తద్వారా ఆర్థికంగా ఎలా నష్టం కలుగుతుందనే తదితర విషయాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీవో నవీన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా బీసీ అభివృద్ది అధికారిణి ఇందిర, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం, జిల్లా మత్స్య శాఖ అధికారిణి రాధ రోహిణి తదితరులు పాల్గొన్నారు.