మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 20 : రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రాబోయే మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటా ఒకే నెలలోనే పంపిణీ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. ఇప్పటికే మే సరుకుల పంపిణీ ప్రక్రియ ముగిసింది. ఇక జూన్, జులై, ఆగస్టుకు సంబంధించిన కోటా కూడా ఈ నెలలోనే ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏదైనా పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే ప్రజలకు ఇబ్బంది కావొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
పంపిణీ సక్రమంగా సాగేనా..?
మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటా లబ్ధిదారులకు ఒకేసారి ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో కార్డుదారులకు దీనిపై పెద్దగా అవగాహన లేదు. దీంతో అసలు బియ్యం పంపిణీ చేస్తారా..? మాయం చేస్తారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తేనే ఫలితం దక్కుతుంది. అప్పుడే అర్హుల చెంతకు బియ్యం చేరే అవకాశం ఉన్నది. ఈ విషయమై పాలమూరు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ కమిషనర్ నుంచి మౌఖికంగా ఆదేశాలు వచ్చాయని, అధికారిక ఉత్తర్వులు, మార్గదర్శకాలు అందాల్సి ఉన్నదని చెప్పారు.
రేషన్ కార్డులు, యూనిట్లు ఇలా..
పాలమూరు జిల్లాలో మొత్తం 2,44,541 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో ఏఎఫ్ఎస్సీ కార్డులు 19,029, ఎఫ్ఎస్సీ కార్డులు 2,25,312, ఏఏపీ కార్డులు 200 ఉన్నాయి. వీటి పరిధిలో ఏఎఫ్ఎస్సీ కార్డుల్లో 54,245 యూనిట్లు (కుటుంబ సభ్యులు) ఉండగా.. ఎఫ్ఎస్సీ కార్డుల్లో 7,63,513 యూనిట్లు, ఏఏపీ కార్డుల్లో 246 యూనిట్లు ఉన్నాయి. ఈ లెక్కన మొత్తం 8,18,004 యూనిట్లు ఉన్నాయి.
బియ్యం కోటా ఏఎఫ్ఎస్సీ కార్డులకు 6,66,015 కిలోలు, ఎఫ్ఎస్సీ కార్డులకు 45,81,078 కిలోలు, ఏఏపీ కార్డులకు 2 వేల కిలోలు.. మొత్తం రేషన్ కార్డులకు మే నెలకుగానూ 52,49,093 కిలోలు బియ్యం కోటా విడుదలైంది. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లాలో మొత్తం 558 రేషన్ దుకాణాలు ఉండగా.. 2,43,213 రేషన్ కార్డులు ఉండగా.. సభ్యులు 7,40,610 ఉన్నారు. వీరికి మే నెలలో 5,110.250 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 335 రేషన్ దుకాణాలు ఉండగా.. 1,57,434 కార్డుదారులు ఉన్నారు. వనపర్తి జిల్లాలో 325 దుకాణాలు ఉండగా.. కార్డుదారులు 1.53 లక్షల మంది కార్డుదారులు ఉండగా.. మొత్తం సభ్యులు 5 లక్షల మంది ఉన్నారు.
15 వేల మెట్రిక్ టన్నులు అవసరం
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 506 రేషన్ దుకాణాలు ఉన్నాయి. కార్డుదారులు 2,44,541 మంది ఉండగా సభ్యులు 8,18,004 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కోటా విడుదలవుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సన్నబియ్యం అందిస్తున్నారు. మే నెల కోటా సైతం పూర్తయ్యింది. వచ్చే మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటా విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎఫ్‌సీఐలో నిల్వలను పరిశీ లిస్తున్నారు. మూడు నెలలకు 15 వేల మెట్రిక్ టన్నులకుపైగా మహబూబ్‌నగర్ జిల్లాఅవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా స్టాక్ పంపించేందుకు చర్యలు చేపట్టారు.
పెద్ద మొత్తంలో స్టాక్ నిల్వ కష్టమే..
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా రేషన్ దుకాణాల్లో చిన్నగా.. ఇరుకుగా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల బియ్యం కోటా ఇవ్వనుండడంతో స్టాక్‌ను నిల్వ ఉంచడం కష్టమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దుకాణాల కోసం అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను డీలర్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే రేషన్ దుకాణాలకు అందించేందుకు బియ్యం అందుబాటులో లేకున్నా.. పక్క జిల్లాల నుంచి తెప్పించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.