మక్తల్ టౌన్, జనవరి 30 : రాజకీయంలో గెలిచినా.. ఓడినా.. నిరంతరం మక్తల్ ప్రజల వెన్నంటే తన చివరి శ్వాస వరకు ఉంటూ తపిస్తానని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం రామన్న జన్మదినం సందర్భంగా చిట్టెం దంపతులు మక్తల్ పడమటి అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయం అనేది ఎప్పటికీ ఉండేదేనన్నారు. రాజకీయంలో ఓటమి, గెలుపు వస్తూ పోతూ.. ఉంటాయని కార్యకర్తలకు సూచించారు. మక్తల్ నియోజకవర్గ ప్రజలే తన కుటుంబంగా భావించి 18 ఏండ్ల నుంచి ఇక్కడి ప్రజలకు సేవ చేస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గ ప్రజల ప్రేమాభిమానాలను సొంతం చేసుకోవడం పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. అధికారంలో లేకపోయినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు, తనను నమ్ముకున్న కార్యకర్తలకు వెన్నంటే ఉండి వారి యోగక్షేమాలను నిరంతరం చూసుకుంటానన్నారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటున్న తనకు స్థానిక ప్రజలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఇంతటి ప్రేమాభిమానాలు చూపించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అలాగే రామన్న బర్త్డే సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అభిమానులు, నాయకులు అభిమానాన్ని చాటుకున్నారు. భారీ సంఖ్యలో పట్టణానికి తరలొచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.