ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలోని పులిమామిడి కొండపై వెలసిన రామలింగేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు ( Rathotsavam ) అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా సోమవారం అగ్నిగుండం నిర్వహించారు. ఆలయ పూజారుల ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకం, వస్త్ర అలంకరణ, మహా మంగళ హారతి నిర్వహించారు.
వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కొండపైకి చేరుకుని స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం స్వామివారి రథోత్సవ వేడుకల్లో చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా భక్తులు పోటీపడి రథాన్ని ముందుకు నడిపించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఎల్లా గౌడ్, మాజీ సర్పంచ్ సూరయ్య గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తిమ్మారెడ్డి, బసిరెడ్డి, వెంకట్రామారెడ్డి, సంజన్న, ప్రాణేష్, విజయన్ గౌడ్, వన్నెకారి శ్రీనివాసులు, చిప్ప విజయకుమార్, బస్వరాజ్ పాల్గొన్నారు.