ధన్వాడ, ఫిబ్రవరి 3 : రాష్ర్టానికి కేంద్రం నిధులు సాధించడంలో ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్. రాజేందర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నారాయణ పేట జిల్లాకు సైనిక్ స్కూల్ సాధించడంలో బీజేపీ ఎంపీ ఉన్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి చేరో 8మంది ఎంపీలు ఉన్నా నిధులు ఎందుకు తేలేదని ప్రశ్నించారు.
అలాగే రాష్ట్రంలో ఆధికారంలో ఉన్న కాంగ్రెస్ 14 నెలలుగా ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. తన సొంత గ్రామం శేరివెంకటాపూర్‌లో రూ.2లక్షల్లోపు 175మంది రైతులకు రుణం ఉన్నా.. ఇంకా మాఫీ కాలేదన్నారు. వరికి బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వడంలేదని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కుంటుపడిందని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్త ఇర్ఫాన్‌పై పెట్టిన తప్పు డు కేసు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేవారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు సుధీర్కుమార్రావు, చంద్రశేఖర్, మాధవరెడ్డి, సురేందర్‌రెడ్డి, మల్లేశ్‌గౌడ్, శాంతకుమార్, శివారెడ్డి, నాజర్, ఇర్ఫాన్, వెంకట్రాములు, రామకృష్ణారెడ్డి, వీరేశ్ కుమార్‌గౌడ్, బాలరాజు తదిదతరులు పాల్గొన్నారు.