అచ్చంపేట రూరల్ : ఆపరేషన్ కగారును ( Operation Kagar ) నిలిపి వేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ( CPI ) పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సీపీఐ నియోజకవర్గ సమితి కార్యదర్శి పెరుముల గోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్, అడ్వకేట్ రాజేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మస్తాన్ , జేఏసీ కన్వీనర్ కె నర్సయ్య, కేఎన్పీఎస్ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ మాట్లాడారు.
రాజ్యాంగ లక్ష్యాలను కేంద్రం పాటించకపోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని విమర్శించారు. మావోయిస్టు పార్టీ స్వచ్ఛంద కాల్పుల విరమణ ప్రకటించగా కేంద్రం మొండిగా నిత్యం కాల్పులు జరుపుతూ భయానక వాతావరణం సృష్టిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి మధ్యవర్తుల ద్వారా ప్రజల సమస్యలపై శాంతి చర్చలు జరపాలని కోరారు.
మధ్య భారత దేశంలో నిక్షిప్తమైన సహజ వనరులను ఆదాని (Adani ), అంబానీ ( Ambani ) లాంటి గుజరాత్ పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పగించడం కోసమే మారణకాండ సాగిస్తున్నారని విమర్శించారు. చత్తీస్గఢ్ , కేంద్ర ప్రభుత్వము ఖనిజ సంపద తవ్వకాల కోసం అదాని, వేదాంత, ఎస్సార్ లాంటి బహుళ జాతి కంపెనీలతో 230 ఎంఓయూలు కుదుర్చుకుందని విమర్శించారు. ఈ ఒప్పందాల కాలపరిమితి 2026 నాటికి ముగింపు దశకు రావడంతో పెట్టుబడిదారుల ఒత్తిడితో ఆదివాసీల పై దమనకాండను కొనసాగిస్తుందని విమర్శించారు. వెంటనే ఆపరేషన్ కగారును నిలిపివేయాలని వక్తలు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ డివిజన్ నాయకులు, ఎస్టీపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ అంబయ్య, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి జె బాలయ్య , ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బాలకిష్టయ్య, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శ్రీశైలం, బీసీ సంఘం నాయకులు నల్లమల్ల యాదయ్య, బీఎస్పీ నాయకులు కృపానందం ,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్పా ల్గొన్నారు.