మహబూబ్‌నగర్, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆందోళనలు నిరసనలు నిలదీతలు.. బహిష్కరణల మధ్య ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన గ్రామసభల న్నీ తుస్సుమన్నాయి. ఆరు గ్యారెంటీల్లో భా గంగా నాలుగు పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని భావించి ఏర్పాటు చేసిన గ్రామసభలన్నీ రణరంగాన్ని తలపించాయి. మ ంత్రులు ఎమ్మెల్యేలకు కూడా ప్రజలు చుక్కలు చూపించారు. ఇక అధికారులు అయితే సమాధానం చెప్పుకోలేక పోలీసుల సహకారంతో బయటపడ్డారు. శుక్రవారం నాలుగో రోజు కూ డా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రామసభలన్నీ వాగ్వాదాలు, నిలదీతలు, నిరసనలతో ముగిశాయి.
అర్హుల జాబితాలో తమ పేర్లు లేవంటూ గ్రామస్తులు నెత్తి నోరు మొత్తుకున్నా మంత్రి, ఎమ్మెల్యేలు అధికారులు కనికరించలేదు. వాస్తవంగా అర్హులను ఎంపిక చేయాలని గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకొని అక్కడికక్కడే పరిష్కరించాలని ఏర్పాటు చేసిన సభలన్నీ అందుకు భిన్నంగా సాగాయి. ముందుగానే ఎమ్మెల్యేలు ఇచ్చిన లిస్టులను గ్రామసభల్లో ఉంచి వాటికి ఆమోద ముద్ర వేయించుకుందామని ప్రయత్నించిన అధికార యంత్రంగానికి ఎదురుదెబ్బ తగిలిం ది. అయినా ప్రభుత్వం అర్హులను కాదని అనర్హులకే అందలం ఎక్కించేందుకు సిద్ధమవుతున్నది. ఈనెల 26 నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేల లిస్టులకే గ్యారెంటీ స్కీములు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీంతో గ్యారెంటీలన్నీ గోవిందా.. అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.
Grama Sabhas 5
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత గ్రామసభల పేరుతో గ్రామాల్లో చేపట్టిన సభలన్నీ వాడి వేడిగా సాగినా కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం భాయిభాయిగా తిరిగారు. ఏ గ్రామసభలో నూ ఒక్క బీజేపీ నేత కూడా ప్రశ్నించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా బీజేపీ నేతలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో చెట్ట్టాపట్టాలేసుకొని గ్రామసభలకు హాజరు కావడం విమర్శలకు తావిస్తోంది. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరు ణ కూడా గ్రామసభల్లో దర్జాగా పాల్గొని ఎక్కడా లబ్ధిదారుల తరఫున మాట్లాడకపోవడం గమనా ర్హం. పైగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ఎంపీ కోసం అధికార పార్టీ నేతలు రెండు గంటలు వేసి చూడడం విస్తూ గొలిపింది. దీంతో కాంగ్రెస్ బీజేపీలు కలిసి గ్రామసభల్లో పాల్గొనడం పలు విమర్శలకు తావిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం నాలుగు గ్యారెంటీల అమలు కోసం చేపట్టిన గ్రామసభల్లో అధికారులు పోలీసు యంత్రాంగం బ లైంది. ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తుంటే అధికారులను కాపాడలేక పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఉంటేనే అధికారులు గ్రామసభల్లోకి వెళ్లగలిగే పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నెలకొంది. దీంతో అధికార పార్టీ నేత లు ఇండ్లల్లో కూర్చొని జాబితాలు తయారు చే స్తే.. ఆ జాబితాలు పట్టుకొని గ్రామసభలకు వె ళ్లిన అధికారులకు ప్రజలు ముచ్చేమటలు పట్టించారు.
కొన్నిచోట్ల గ్రామసభలు ఉద్రిక్తతకు దారితీసాయి. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించిన ప్రాంతాల్లో సాక్షాత్తు ఎస్పీలే బందోబస్తులు దగ్గరుండి పర్యవేక్షించారు. మిగతా చోట్లా అదనపు ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్సైతోపాటు పలువురు పోలీసు సిబ్బంది సభల్లో గొడవలు జరగకుండా తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. ఇంటెలిజెంట్ సమాచారం మేరకు గొడవలు జరగని ప్రాంతాలకు ఉన్నతాధికారులు వెళ్లేందుకు పోలీసు యంత్రాంగం మొత్తం రేయింబవళ్లు కష్టపడింది. మొత్తంపైన ఉమ్మడి జిల్లాలో గ్రామసభలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇక గ్యారెంటీలు అర్హులకు ఇస్తారా అనర్హులకే కట్టబెడతారా వేచి చూడాల్సింది.
ఉమ్మడి జిల్లాలో గ్రామసభల చివరి రోజు అదే సీన్ రిపీట్ అయింది. వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెంలో జరిగిన గ్రామసభ రసాభాసగా సాగింది. ప్రారంభంలోనే గ్రామంలో మంజూరైన ఇండ్ల లిస్టును చదువుతుండగా గ్రామస్తులు ఒక్కసారిగా అధికారులపైకి దండెత్తారు. లిస్టులో కొందరు పేర్లు వచ్చాయని మిగతావారి పేర్లు ఎందుకు రాలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే కేవలం 10 నిమిషాలు కూడా గ్రామసభ జరగకపోగా వచ్చిన అధికారులంతా పలాయనం చిత్తగించారు.
నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామసభలో ప్రజలు అధికారులను నిలదీసారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభ గందరగోళానికి దారితీసింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాతో అవకతవకలు జరిగినాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖాళీ స్థలాలు చూయించినా జాబితాలో పేర్లు లేకపోవ డం ఏమిటి అని అధికారులను ప్రశ్నించారు. రేషన్ కార్డుల జాబితాలో కూడా అన్యాయం జరిగిందని వాపోయారు.
ఉండవెల్లి మండలం చిన్నఆముదాలపాడు గ్రామంలో గ్రామసభ రసాభాసగా సా గింది. అయిజ మండలం ఉప్పల సభలో ఇందిర మ్మ ఇండ్ల కేటాయింపులో అర్హులకు చోటు ద క్కలేదని అధికారులపై గ్రామస్తులు మండిపడ్దారు. నా రాయణపేట జిల్లా కృష్ణ మండలకేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తుల పేర్లు లేకపోవ డం.. ఇతర గ్రామాల నుంచి వలస వచ్చిన వారి పేర్లు ఉన్నాయని అధికారులను నిలదీసారు.
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కారుకొండలో పోలీసు పహారాలో గ్రామసభ నిర్వహించారు. అర్హులకు పథకాలు అందలేదని ప్రజలు అధికారులను నిలదీశారు. కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామసభలో రుణమాఫీపై అధికారులను నిలదీయడంతో తాసీల్దార్ కాంగ్రెస్ నాయకుడిలా మా ట్లాడి హామీలు గుప్పించడం విమర్శలకు తావిచ్చింది. దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామసభలో తమ పేర్లు రాలేదని గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామంలో గ్యారెంటీ స్కీముల జాబితాలో తమ పేర్లు లేవని నిలదీశారు.
రాజోళి, జనవరి 24 : రాజోళిలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో రైతులు ఆందోళన నిర్వహించారు. అయితే భారత్‌మాల రోడ్డులో భూములు కో ల్పోయిన రైతుల వివరాలను భూమి రికార్డులతోపాటు రైతుభరోసా పథకం నుంచి తొలగిస్తున్నట్లు వి వరాలను గ్రామసభలో తాసీల్దార్ రామ్మోహన్, ఎం పీడీవో ఖాజా వివరించడంతోపా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను అడ్డుకున్నారు.
తమ భూము ల్లో భారత్‌మాల రోడ్డులో పోయినందుకు ఇప్పటి వరకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని అధికారులు మాకు అన్నీ ఇచ్చినట్లు భూ రికార్డులో మాపేర్లుతీసేయడం, అదేవిధంగా రైతు భరోసా కూడా రాకుండా చేయడం ఏమిటని అధికారులను నిలదీశారు. మాకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు రికార్డుల నుంచి తొలగించవద్దని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజలు సైతం రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల జాబితాల్లో తమ పేర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మరోసారి దరఖాస్తులు ఇవ్వాలని సూచించగా ఎన్ని సార్లు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులపై మండిపడ్డారు.