హన్వాడ, ఆగస్టు 11 : మండల కేంద్రంతోపాటు పల్లెమోనికాలనీ వద్ద గల మహాత్మాజ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లో సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ప్రహరీలేక గురుకులాల్లోకి విషసర్పాలు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. పల్లెమోనికాలనీ వద్ద గల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, అటెండర్ కొరత ఉన్నది.
నీళ్ల కోసం బోర్లు వేసినా చుక్కనీరు పడకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు కనీస మౌలిక సదుపాయాలు లేక నిత్యం విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టింపులేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.