మద్దూర్, జనవరి 5 : చదువు కోసం విద్యార్థులు ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం మద్దూర్ మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యార్థుల పరిస్థితికి అద్దం పడుతుంది. మండలంలోని పెదిరిపాడు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సమీపంలో ఉన్న తండా నుంచి, చెన్నారెడ్డిపల్లి నుంచి బస్సు సౌకర్యం లేదు.
ఆయా గ్రామాల నుంచి విద్య కోసం విద్యార్థులు నిత్యం ఇలాంటి సాహస ప్రయాణాలు చేస్తూనే పాఠశాలకు వెళ్తారు. సోమవారం కూడా ఓ ప్రైవేట్ బొలేరో వాహనం వెనుకాల ఉండే బంపర్‌పై నిల్చోని విద్యార్థినులు పాఠశాలకు వెళ్లడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతటి ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులను ఎక్కించుకోవడంపై బొలేరో వాహనం డ్రైవర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసులకు విష యం తెలిసిన నేపథ్యంలో డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.