జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 24 : జాతీయ రహదారి-44పై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు మంటలు అంటుకొని దగ్ధమైన సంఘటన జడ్చర్ల సమీపంలో చోటు చేసుకున్నది. పోలీసులు, ప్రయాణికుల కథనం మేర కు.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు సలీం ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆదివారం రాత్రి బయలుదేరిం ది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూత్పూరు మండల కేంద్రం దాటాక బస్సు వెనుక ఒక టైర్ పెద్ద శబ్ధంతో పేలింది. అయినా డ్రైవర్ బస్సును అలాగే 5 కిలోమీటర్లు నడిపాడు.
మల్లెబోయిన్పల్లి శివారులోకి రాగానే పేలిన టైర్ వద్ద మంటలు రావడాన్ని ప్రయాణికులు గమనించి డ్రైవర్‌కు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు ను పెట్రోల్ బంక్ సమీపంలో నిలిపివేశాడు. అప్పటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. అందులోని 38 మంది ప్రయాణికులు భయాందోళనతో బస్సులోంచి బయటకు పరుగులు పెట్టారు. మంటలు ఆర్పేందుకు ప్రయాణికులు చేసిన కృషి ఫలించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను ఆర్పారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.