కోస్గి, ఆగస్టు 22 : పాలిటెక్నిక్ విద్యార్థుల శాపంగా మారిన జీవో 97ను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శివరాజ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కోస్గిలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని, ఇప్పుడు జీవో 97ను తెచ్చి పాలిటెక్నిక్ విద్యను భ్రష్టు పట్టించేందుకు సిద్ధమైందని ఆరోపించారు. ఈ జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తం గా విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నా సీఎం పట్టించుకోకుం డా విదేశాల్లో చక్కలు కొడుతున్నారని ఆరోపించారు.
రేవంత్ సర్కారు పాలిటెక్నిక్ విద్యను ప్రైవేట్ పరం చేసి పేదలకు సాంకేతిక విద్యను అందకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని దీనికి ఎంతమాత్రం సహించమని, జీవోను ఉపసంహరించుకునే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్వీ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు కోట్ల మహిపాల్ మాట్లాడుతూ జీవో 97 విషయంలో ప్రభుత్వం పంతానికి పోతే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యార్థులతో పెట్టుకున్న ఎవరూ ముందుకు పోయిన దాఖలాలు లేవని, మొన్నటికి మొన్న ప్రధాని మోదీ సైతం విద్యార్థుల పోరాటానికి దిగిరాక తప్పలేదని గుర్తు చేశారు. జీవో నెంబర్ 97ను రద్దు చేయకపోతే కడ కార్యాలయాన్ని, కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
అనంతరం కోస్గి బీఆర్ఎస్ ఇన్చార్జి వెంకట్ నర్సింహులు మాట్లాడుతూ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. సీఎం ఇలాకాలో ఇప్పటికే చాలా పాఠశాలలు మూతపడ్డాయని, ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్య మీద ఆయన కన్ను పడిందని దాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని, విద్యార్థుల జోలికి వస్తే ఏ ప్రభుత్వమైనా గద్దె దిగాల్సిందేనన్న విషయాన్ని గుర్తెరిగి మసులుకోవాలని సీఎం రేవంత్‌కు హితవుపలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ ఇన్చార్జి నరేశ్, వినయ్‌కుమార్‌రెడ్డి, కోనేరు సాయప్ప, పకీరప్ప, బెజ్జు నర్సింహ, చెన్నప్ప, విద్యార్థి నేత అనిల్‌తోపాటు పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.