జడ్చర్ల, సెప్టెంబర్ 27 : జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్ వద్ద గల అరబిందో ఫార్మా కంపెనీలో శనివారం పొల్యూషల్ కంటోరల్ బోర్డు అధికారులు తనిఖీలు చేపట్టారు. కంపెనీ నుంచి వచ్చే కలుషిత జలాలు ముదిరెడ్డిపల్లి చెరువులను కలుషితం చేస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, ఈసారి చర్యలు తీసుకోకుంటే ఆదివారం కంపెనీ వద్దకు వెళ్లి తగలబెడుతానని స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి శుక్రవారం హెచ్చరించారు.
దీంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు శనివారం కంపెనీలోని కలుషిత జ లాలకు సంబంధించిన పైపులైన్లు, స్టోరేజీ ట్యాంకులను బోర్డు జోనల్ అధికారి నరేందర్, ఈఈలు యాదయ్య, సురేశ్, ఏఈఎస్ విద్యుల్లత పరిశీలించి నీటి నమూనాలను సేకరించారు. అయితే నీళ్లు లేకుండా ఖాళీ ట్యాం కులు దర్శనమచ్చాయి.
ఈ సందర్బంగా ఫార్మాసెజ్ చుట్టుపక్కల పోలేపల్లి, రాయపల్లి, ముదిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు అక్కడికి వచ్చి తమకు జరుగుతున్న ఇబ్బందులను అధికారులకు తెలిపారు. కలుషిత నీటిని బయటకు విడుదల చేయడం వల్ల నీరంతా పొలాల్లోకి వస్తున్నాయని, పంటలు పండక, బోరుబావుల్లో నీరుకలుషితమవుతున్నట్లు వెల్లడించారు.
అరబిందో కంపెనీకి పొల్యూషన్ బోర్డు అధికారులు వచ్చారన్న సమాచారంతో కంపెనీలోకి రైతులను వెళ్లకుండా కంపెనీ ప్రతినిధులు అడ్డుకున్నారు. అయినా వినకుండా రైతు లు అధికారుల వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం పొల్యూషన్ కం ట్రోల్ బోర్డు జోనల్ అధికారి నరేందర్ మాట్లాడుతూ మెంబర్ సెక్రటరీ ఆదేశాల మేరకు అరబిందో కంపెనీ తనిఖీకి వచ్చినట్లు తెలిపారు. వాస్తవ పరిస్థితిపై రిపోర్టును పైఅధికారులకు అందిస్తామన్నారు.