Narayanapet | ఊట్కూర్, జూన్ 3 : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పగిడిమర్రి, కొల్లూరు గ్రామాల్లో మంగళవారం గ్రామ దేవత పోచమ్మ తల్లి ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు డోళ్ళు, డప్పుల చప్పుళ్లతో తలపై బోనం ధరించి గ్రామ దేవత ఆలయానికి ఊరేగింపు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. పలువురు కురుమ యాదవులు గొర్రెలు, కోళ్లు, మేకలను బలిచేసి మొక్కులు చెల్లించుకున్నారు. పశుసంపద వర్ధిల్లాలని, పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఇష్ట దేవతను వేడుకున్నారు. భక్తులు, బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలను ఆరగించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు నారాయణ గౌడ్, అశోక్, విష్ణుమూర్తి గౌడ్, బీరప్ప, గడ్డం మల్లప్ప, భీమప్ప తదితరులు పాల్గొన్నారు.