నాగర్ కర్నూల్: సమాజంలో మంచి చెడులను తెలియచేసేవే నాటకాలని శాసనమండలి సభ్యులు గోరేటి వెంకన్న (MLC Goreti Venkanna) అన్నారు. తెలుగు నాటక రంగ (Plays ) దినోత్సవ సందర్భంగా కందనూలు కళా సేవా సమితి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పట్టణంలోని సాయి గార్డెన్స్ లో ప్రదర్శించిన చింతామణి ( Chintamani ) నాటక ప్రదర్శనలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.
సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను వివిధ కళా ప్రదర్శన ద్వారా కళాకారులు ప్రజల్లోకి తీసుకెళుతున్నారని, మానసిక ఆహ్లాదంతో పాటు, సందేశాన్ని కూడా అందిస్తున్న నాటకాలు ఎంతో గొప్పవని ప్రశంసించారు. ఈ సందర్భంగా నాటక రంగానికి సేవ చేస్తున్న మహబూబ్ నగర్‌కు చెందిన వి నారాయణను కళా సేవా పురస్కారంతో సత్కరించారు. చింతామణి నాటకం ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకర్శించింది.
ఈ నాటకంలో బి నర్సింహారెడ్డి, జి విష్ణుమూర్తి, చిలువేరి వెంకటయ్య, డి రాములు, జి మురళీధర్ రావు, వనజ కుమారి, తిరుమలాభి, ఝాన్సీ, రాంకిషన్ రావు, కౌశిక్ చారి నటించారు. అనంతరం జిల్లాలోని అన్ని కళా సంస్థల అధ్యక్ష ,కార్యదర్శులను సంస్థ ఆద్శర్యంలో సన్మానించారు. జిల్లా నాటక సమాజం సమాఖ్య అధ్యక్షులు ఆర్ సత్యం నిర్వహించగా , సంస్థ సభ్యులతో పాటు జిల్లాలోని కళాకారులు పాల్గొన్నారు.