అలంపూర్: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి (Bala Brahmaswara Swamy) దేవస్థానాన్ని భక్తులకు సౌకర్యవంతంగా,పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ (Collector BM Santosh) అధికారులను ఆదేశించారు. శుక్రవారం అలంపూర్‌లోని జోగులాంబ దేవస్థానం అభివృద్ధి కోసం కమిటీ సభ్యులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆలంపూర్( Alampur ) పరిధిలోని పలు ముఖ్య ప్రాంతాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని భక్తులకు ఆధునిక సౌకర్యాలతో పాటు, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దేవస్థానానికి దిశానిర్దేశకంగా ఏర్పాటు చేసిన బోర్డులను ( Boards ) ఇటిక్యాల క్రాస్ రోడ్, మనోపాడ్, అలంపూర్ క్రాస్ రోడ్, అలంపూర్ ఫ్లైఓవర్ వద్ద పరిశీలించారు.ఈ బోర్డులను మరింత ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా పునఃరూపకల్పన చేయాలన్నారు.
హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి, ఎర్రవల్లి నుంచి అలంపూర్ జాతీయ రహదారి మార్గంలో కీలక ప్రదేశాల్లో దిశానిర్దేశక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.ఈ ప్రదేశాల్లో ఆకర్షణీయంగా ల్యాండ్ స్కేపింగ్ చేయడంతో పాటు, దేవస్థానం చరిత్రను ప్రతిబింభించే విధంగా ఉండాలని,స్పష్టమైన పెద్ద అక్షరాలతో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.
అలంపూర్ క్రాస్ రోడ్ వద్ద అండర్‌పాస్ ఫ్లైఓవర్‌ను పరిశీలించి,ఆలయ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే చిత్రలేఖనాలు, పెయింటింగ్ పనులు చేపట్టాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ ఇతర సదుపాయాలు కల్పించేందుకు అక్కడే ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని పరిశీలించారు. రహదారి పక్కన అవెన్యూ ప్లాంటెషన్ చేపట్టాలని ఆర్ అండ్ బి శాఖను ఆదేశించారు.
అలంపూర్ రైల్వే గేట్ వద్ద నిర్మాణంలో ఉన్న ఆలయ అర్చ్ను పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాపనాశి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, ఆర్డీవో శ్రీనివాసరావు, దేవాలయ చైర్మన్ నాగేశ్వర్, దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.