మహబూబ్‌నగర్, జనవరి 5: గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు స్థలాలు అప్పగించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీలోగా అన్ని మండలాల్లో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు స్థలాలను అప్పగించాలన్నారు. టీకేపీలకు ఎక్కడైనా ఆటవీ భూములను గుర్తించిన చోట తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు వినియోగించుకునే విషయమై తక్షణమే అటవీశాఖ పీసీసీఎఫ్‌కు లేఖ రాయాలని సూచించారు.
క్రీడాప్రాంగణాలకు స్థలాలను ఇచ్చే విషయంలో భూమి కొలతల శాఖ ఏడీ, డీఐవోలు క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు. ముందుగా ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణం ఉండేలా స్థలాలను ఇవ్వాలని, మొత్తం 441టీకేపీలకు అప్పగించాలని సూచించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలపై కలెక్టర్ వెంకట్రావు ప్రత్యేకంగా సమీక్షించారు. కనీసం 10 ఎకరాలకు తగ్గకుండా స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఇప్పటికే 75స్థలాలను బృహత్ పల్లె ప్రకృతి వనాలకు స్థలాలు అప్పగించడం జరిగిందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి మండలానికి రెండు బృహత్ పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం తుది ఓటరు జాబితాను ప్రచురించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన కంటి వెలుగు కార్యక్రమంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో సమీక్ష నిర్వహిస్తున్నందున తాసిల్దార్లు, ఎంపీడీవోలు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, తాసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లు, ఆర్ఐలు, కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.