ఊరుకొండ : మండలంలోని ఊరుకొండ గ్రామపంచాయతీకి చెందిన సర్వే ప్లాట్లను (Panchayat Plots ) కాంగ్రెస్ నాయకులు ( Congress Leaders ) ఆక్రమించుకుని అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నారని గ్రామ యువత నేతాజీ యువజన సంఘం నాయకులు సోమవారం డిప్యూటీ ఎమ్మార్వో శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. గ్రామ కంఠంలోని 91, 92, 93, 94 నెంబర్ గల ప్లాట్లను అక్రమంగా ఆక్రమించుకొని భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాలనలో గ్రామానికి సంబంధించిన ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని , అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే గ్రామానికి సంబంధించిన పంచాయతీ ప్లాట్లను ఆక్రమించుకొన్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఆర్డీవోకు కూడా వినతిపత్రాలు అందజేస్తామన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్లాట్లను ఎవరు ఆక్రమించకుండా తగు చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజయ్య, కొమ్ము శీను, బండి మల్లేష్, సంగప్పగౌడ్, ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, వెంకటయ్య, గ్రామ నాయకులు పాల్గొన్నారు.