కొల్లాపూర్, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి సాదాసీదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పారు. రైతు రుణమాఫీ కాలేదని, రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. దీంతో ప్రజలంతా మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ‘మన అందరికీ ముందు ముందు మంచి రోజులు ఉంటాయని కోరుకుందాం’ అని కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్రంలో ప్రజలలో చాలా వ్యతిరేకత వచ్చిందని బీరం హర్షవర్దన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరూ ప్రజల మద్య తిరుగుతూ వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. కేసీఆర్ కృషితో పెద్దకొత్తపల్లి మండలానికి ఎన్హెచ్ 167కే హైవే వచ్చిందని అన్నారు. దీంతో పెద్దకొత్త పల్లి మండల రూపు రేఖలు మారిపోయాయన్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలందరూ సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.