మక్తల్ టౌన్, అక్టోబర్ 8 : ఆహా ఏమి రుచి తినరా మైమరిచి.. తాజా కూరలలో రాజా ఎవరంటే.. వంకాయే అంటూ ఆకుకూరలపై సినీగేయకులు సైతం పాటలు రాసారు. అలాంటి తాజా ఆకుకూరలను విడిచి ఫాస్ట్‌ఫుడ్, వేపుళ్లతో మాంసాహారంపై ఆసక్తి కనబరుస్తూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు ప్రజలు. ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. మేధోశక్తిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలను తీసుకోవాలని చెబుతున్నారు. క్యాబేజీతో బరువును తగ్గించుకునే అవకాశమున్నది. అంతేకాకుండా కాకరతో షుగర్ వ్యాధి తగ్గింపు, అరటితో జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ఆకుకూరలు సైతం కంటిచూపు ఇతర అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్న ప్రజలు సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలను కొనుగోలు చేసేందుకు అధికంగా ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ప్రభుత్వం సైతం కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నది. రైతులు సైతం సేంద్రియ పద్ధతిలో, పెరటి తోటల పెంపకంతో లాభాలను గడిస్తున్నారు.
బీరతో ఆరోగ్యం పదిలం..
కూరగాయల మార్కెట్లో అన్ని కాలాల్లో లభించే కాయగూరల్లో బీరకాయ ఒకటి. అనారోగ్యంతో ఉన్నవారు దీనిని ఆహారంలో తీసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. నెలసరితో బాధపడుతున్న వారు సైతం బీరకాయను ఆహారంగా తీసుకుటే ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు సూచిస్తారు. పిల్లలకు ఈ కూరగాయ వంటకం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
బెండతో మిజిస్ అధికం..
బెండకాయలో మిజిస్ వంటి పదార్థం అధికంగా ఉంటుంది. ఇది కడుపు మంట నుంచి ఉపశమనాన్ని కల్గిస్తుంది. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతోపాటు విటమిన్ సి అధికంగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ నివారణకు బెండకాయ ఎంతో ఉపయోగపడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేస్తుంది. బెండకాయ డికాషన్ తాగితే జ్వరం తగ్గుముకం పడుతుంది.
దీంతోపాటు శ్వాసకోశ వ్యాధులను నయం చేస్తుంది.
ఉల్లితో ఎంతో మేలు…
తల్లి లాంటి ఉల్లి శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. “తల్లి చేయని మేలు ఉల్లి చేయును” అనే సామేత వాడుకలో ఉంది. రక్తపోటు, గుండెజబ్బు నివారణకు, నిద్రలేమి సమస్యకు ఉల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది.
కంటిచూపునకు.. ఆకుకూరలు
ఆకుకూరలు రోజు వారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటి వల్ల కంటిచూపునకు ఎంతో మేలు కలుగుతుంది. గోంగూర, తోటకూర, పాలకూర ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. వీటిలో మిటమిన్ సి ఉంటుంది. పప్పుతో కలిపి వీటిని వండి తింటే ఆ రుచే వేరు. ఆకుకూరలు జీర్ణశక్తిని ఎంతోగానో పెంచి ఆకలిని పుట్టిస్తాయి.
మునగ..
మునగ కాయ, ఆకుల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, సీ తోపాటు పొటాషి యం ఎక్కువగా ఉంటుంది. ఇది గనేరియా, సిటిలిస్ వ్యాధులను నయం చేయడంతోపాటు జీర్ణశక్తిని పెంచుతుంది. మునగకాయ ముక్కలను నీ టిలో వేస్తే నీరు కూడా శుద్ధి అవుతుంది. మనుషులతోపాటు జంతువులకూ శక్తివంతమైన ఆహారం.
టమాట..
ఈ కూరగాయకు ఒక ప్రత్యేకత ఉంది. కాయకూరల్లో వేడివేడి టమాట పప్పు ప్రతి ఇంటి వద్ద నోరు ఊరిస్తుంది. దీంట్లో ‘సి’ మిటమిన్ అధికంగా ఉంటుంది. టమాటను అన్ని రకాల వంటల్లో వినియోగించవచ్చు. దీనిలోని సిట్రిక్ ఆమ్లం ఎసిడిటీని దూరం చేయడంతోపాటు ఎముకలు గట్టి పడేందుకు ఉపయోగపడుతుంది. టమాటను కూరగాయాల్లో వినియోగించడం ద్వారా బరువు తగ్గడంతోపాటు పక్షవాతం కూడా తగ్గుతుంది. టమాటను రోజూ తినడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గుముకం పడుతుంది.
కాకర..
కాకర రసం సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది. ఇది షుగర్ వ్యాధిని తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కూరగాయ తినడానికి చేదుగా ఉన్న శరీరానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ పంట అన్ని ప్రాంతాల్లో పండుతుంది. సోరియాసిస్ వ్యాధి నివారణకు కాకర ఉపయోగపడుతుంది. కాకరలో మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి. కాకర పులుసును బెల్లంతో వండితే వదిలిపెట్టరు. కాకరకాయ వ్యాధి నిరోధక శక్తిని పెంపొదిస్తుంది. ఇమ్యునో మోడలేటర్గా పనిచేయడం వల్ల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.
రారాజుగా వంకాయ..
వంకాయలో చాలా రకాలున్నాయి. తెల్లవంకాయ, పొట్టి వంకాయ, నీటి వంకాయ, ముళ్ల వంకాయ ఇలా వంకాయలు చాలా రకాలున్నాయి. ‘వంకాయ’ రుచికి పెట్టింది పేరు. వంగలో విటమిన్లు, కీలకమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ కూరలోని పోషకాలు యాంటి యాక్సిడెంట్లుగా పనిచేస్తాయి. శరీరంలో ఎక్కువ ఉన్న ఐరన్‌ను ఇది తొలగిస్తుంది. క్యాన్సర్‌నూ నివారిస్తుంది. కీళ్ల సమస్యలకు చెక్ పెడుతుంది.
పొట్లకాయతో హుషారు..
పొట్లకాయ కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. పొట్లకాయలోని ప్రొటీన్లు చిన్నారులను హుషారుగా ఉంచుతాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. పొట్లకాయ కూర దేశమంతా లభిస్తుంది.
అరటితో ఆరోగ్యం..
అరటికాయలు ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. ఇందులో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి 100 గ్రాములు అరటిలో 20 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది సులభంగా జీర్ణమై మలబద్దకాన్ని నివారిస్తుంది. బీపీ, ఎసిడిటీని తగ్గిస్తుంది. విరేచనాలను తగ్గించడమే కాకుండా జ్వరపీడితులకు బాగా ఉపయోగపడుతుంది.
చర్మసౌందర్యాన్ని పెంచే క్యారెట్..
క్యారెట్ కూర తిడం వల్ల చర్మసౌందర్యం పెరుగుతుంది. ఇందులో విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. రేచీకటిని నివారిస్తుంది. ఇందులో ఉండే పాల్కర్నినర్ క్యా న్సర్‌ను నివారిస్తుంది. యాంటీ యాక్సిన్గా పనిచేసి శరీరంలోని చెడును బయటకు పంపుతుంది. పక్షవాతం రాకుండా చేస్తుంది. ‘క్యారెట్’ క్యాన్సర్ పోరాట యోధుడిగా పిలవబడుతుంది.
గోరుచిక్కుడు, సోయచిక్కుడు, పందిరి చిక్కుడు తినడానికి చిక్కుడులో ఎన్ని రకాలో.. గుండెజబ్బులతో బాధపడుతున్న వారికి చిక్కుడు మంచి ఆహారం. రోజువారీ ఆహారంలో చిక్కుడును తీసుకోవాలని వై ద్యులు చెబుతుంటారు. చిక్కుడు కొలెస్ట్రాల్, టైగ్జిరాయిడ్లు పెరగకుండా చేస్తుంది. అరకప్పు చిక్కుడు కూరలో ఏడు గ్రాముల ప్రొటిన్స్, 8 రకాల మిటమిన్లు ఉంటాయి. చిక్కుడు తినడం వల్ల ఐరన్ పెరగడంతోపాటు ఆరోగ్యంగా జీవిస్తారన్నారు.
క్యాబేజీతో బరువుకు చెక్..
క్యాబేజీని రోజువారీ ఆహారంలో తీసుకోవడం ద్వారా బరువుకు చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా క్యాన్సర్‌ను నివారించవచ్చు. పువ్వుబుట్ట రూపంలో లభించే ఈ కూర ఆకుకూరల జాతికి చెందింది. ఇందులో లెవనాయిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. క్యాన్సర్‌ను నివారిస్తుందని వైద్యుల సూచన. అంతేకాకుండా బాలింతలు క్యాబేజీని ఆహారంగా తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా తయారవుతారు.
కూరగాయలతో ఆరోగ్యం..
శాకాహారం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యంతోపాటు దృఢత్వంగా తయారవుతారు. పిల్లలు, నడివయష్కులతోపాటు అందరూ కూరగాయలు తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసిన పంటను తినడం ఆరోగ్యానికి శ్రేయష్కరం.
– డాక్టర్ శ్రీకాంత్, మక్తల్