జడ్చర్లటౌన్, మార్చి 6: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులందరికీ ప్యాకేజీ పెంచి పరిహా రం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మం డలంలోని ఉదండాపూర్‌లో నిర్వాసితులు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం ఉదండాపూర్ నిర్వాసితులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు పనుల వద్దకెళ్లి అడ్డుకున్నారు.
నిర్వాసితులకు ప్యాకేజీ పరిహారం చెల్లించే వరకు పనులు చేయొద్దని హెచ్చరించారు. ప్రాజెక్టు కట్ట వద్ద నిర్వాసితులు టెంట్ వేసుకొని దీక్ష చేపట్టారు. జడ్చర్ల ఎస్సై జయప్రసాద్, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని నిర్వాసితులతో మాట్లాడారు. ఏదైనా ఉంటే అధికారులతో మాట్లాడాలని, ప్రాజెక్టు పనులను అడ్డగించొద్దని సూచించారు. ప్రాజెక్టు వద్ద శాంతియుతంగా పరిహారం కోసం నిర్వాసితులు దీక్ష చేపడుతుండగా, మరోవైపు పోలీసులు భారీగా మోహరించి నిర్వాసితులను దీక్షను తొలగించేందుకు యత్నించారు. ప్రాజెక్టు పనులను అడ్డుకుంటూ ఆందోళన చేస్తే కేసులు నమోదవుతాయని పోలీసులు హెచ్చరించగా, పోలీసు కేసుల కు భయపడమని న్యాయం కోసం మా పోరాటం జరుగుతుందని ని ర్వాసితులు చెప్పారు.
ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మా ట్లాడుతూ.. 2021 కటాప్ తేదీ తర్వాత 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ ప్యామిలీ ప్యాకేజీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉదండాపూర్ నిర్వాసితులందరికీ ప్యాకేజీ పెంచి ఇస్తామని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హామీ మేరకు అధికారుల సర్వేకు సహకరించామన్నారు. సర్వే పూర్తయి వారం గడుస్తున్నా.. ఇప్పుడు ప్యాకేజీ పరిహారం గురించి ప్ర భుత్వం నుంచి జీవో రావాలని కలెక్టర్ చెబుతున్నారన్నారు. అందుకే మళ్లీ ప్రాజెక్టు పనులను అడ్డుకొని పోరాటం కొనసాగిస్తున్నామని తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అధికారుల మాటలు నమ్మే స్థితిలేదని.. నేరుగా సీఎం తో మాట్లాడిస్తే ఒప్పుకుంటామని నిర్వాసితులు చెప్పారు.