గద్వాల, జనవరి 5 : పేదల ఆకలిని తీర్చే రేషన్ బియ్యాన్ని కొందరు అధికారులు సహాయంతో పక్కదారి పట్టిస్తున్నా రు. కొందరు రేషన్ డీలర్లు, మిల్లర్లకు కాసులు కురిపిస్తున్నది. కరోనా నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తుండగా, డీలర్లు పక్కదారి పట్టిస్తుండడంతో మిల్లర్లు కోనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి తిరిగి సీఎమ్మార్‌గా అప్పగిస్తున్నారు.
ఇందు కు సివిల్ సప్లయ్‌శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు అటు డీలర్లకు, ఇటు మిల్లర్లకు సహకరిస్తుండడంతో జిల్లాలో వారి దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నది. కొందరు డీలర్లు తమకు చెందిన రేషన్ దుకాణాలను మరొకరికి బినామీగా ఇచ్చి అక్రమ దందాకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం చౌకధర దుకాణాల ద్వారా అందించే రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతున్నా ఎవరూ పట్టంచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. డీలర్లు రేషన్‌దారుల నుంచి తక్కువ ధరలకు సేకరించి మిల్లర్లకు, రాయచూర్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
జిల్లాలో 333 చౌకధర దుకాణాలున్నాయి. 1,60,571 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 4,100 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే లబ్ధిదారులు 2,914 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో రేషన్ బియ్యం సేకరణ జోరుగా సాగుతున్నది. లబ్ధిదారులతోపాటు డీలర్ల నుంచి దళారులు బియ్యాన్ని సేకరిస్తున్నారు. కిలో రూ.8కొనుగోలు చేసి వాటిని మిల్లర్లకు రూ.12నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు వీటిని రీసైక్లింగ్ చేసి ఎఫ్సీఐకు సరఫరా చేస్తున్నారు.
జిల్లాలో రేషన్ దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. పేరు ఒకరిదైతే నిర్వహణ మరొకరు చేస్తూ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ దుకాణం దక్కించుకున్న డీలర్, వివిధ కారణలతో తొలగించిన డీలర్ల స్థానంలో కేటాయించిన ఇన్చార్జీలు మాత్రమే సరుకులు పంపిణీ చేయాలి. అలా కాకుండా బినామీలు నిర్వహిస్తూ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దీనికి తోడు డీలర్లకు మాత్రమే తెలియాల్సిన ఈ-పాస్ మిషన్ల కీ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బినామీల చేతుల్లోకి వెళ్లాయి. దీంతో వారే ఓపెన్ చేసి బియ్యం పంపిణీ చేస్తున్నారు.
రేషన్ దుకాణాలపై పర్యవేక్షణ లేకపోవడంతో బినామీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పలు కారణాలతో డీలర్ల వద్ద మిగిలిన బియ్యం రైస్ మిల్లులకు చేరి రీ సైక్లింగ్ తర్వాత ఎఫ్‌సీఐ గోదాంకు వెళ్తున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో బినామీ డీలర్లు కీ రోల్ పోసిస్తున్నట్లు సమాచారం. రెండు, మూడు సంవత్సరాల్లో జిల్లాలో అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 50మంది డీలర్లను తొలగించారు. అయితే ఖాళీ స్థానాల్లో వెంటనే కొత్త డీలర్లను ఆర్డీవో నియమించాల్సి ఉండగా, చేపట్టడం లేదు.
కాగా, చాలా సందర్భాల్లో పార్టీలు మారినప్పుడల్లా ఇతర పార్టీలకు చెందిన డీలర్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలతో ఈ విషయాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒకరిని నియమించిన స్థానంలో కొత్త వారిని తీసుకోవద్దని హైకోర్టు తీర్పునిచ్చింది. సమీపంలోని డీలర్లకు బాధ్యతలు అప్పగించాలని సూచించింది. అదే అదునుగా భావించిన అధికారులు ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు దుకాణాలు కట్టబెట్టారు. ఇన్చార్జి తీసుకున్న వారు తమకు నచ్చిన వారికి బినామీలుగా పెట్టుకోవడంతో నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు గద్వాల, గట్టు, కేటీదొడ్డి, ఇటిక్యాల, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి, మానవపాడ్ మండలాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి అక్రమంగా నిల్వ ఉంచిన 972 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. 62కేసులు నమోదు చేశారు. జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా ప్రతి ఏడాది రూ.కోటికి పైగా లావాదేవీలు కొనసాగుతున్నట్లు సమాచారం. అధికారులు పట్టుకున్న బియ్యం విలువ సుమారు రూ.15లక్షలపైనే ఉంటుందని సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు.వీటితో పాటు ఈ ఏడాది జనవరి 4 శనివారం రాష్ట్రవిజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో దువాసిపల్లి సమీపంలో ఏకంగా 153 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేశారు.