దామరగిద్ద : రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలని మహబూబ్నగర్ జిల్లా వైద్యాధికారి సౌభాగ్య లక్ష్మి ( DMO Saubhagya Lakshmi ) ఆదేశించారు. దామరగిద్దలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది హాజరు రిజిస్టర్ను ఆమె పరిశీలించారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ( National Health Programmes ) పక్కాగా అమలు చేయాలని సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, కేంద్రం లో కాన్పుల సంఖ్య పెంచాలని కోరారు. 30 సంవత్సరాలుపై బడిన అందరికి మధుమేహ, రక్త పోటు పరీక్షలు జరిపి మందులు ఇవ్వాలని అన్నారు.
వడ దెబ్బ గురించి గ్రామాలలో అవగాహన కల్పించి అవసరమున్న వారికి ఓఆర్ఎస్( ORS ) ప్యాకెట్స్ ఇవ్వాలని అన్నారు. ప్రాథమిక కేంద్రంలో అన్ని గదులు పరిశీలించి, మందుల గదిలో అవసరమైనా మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. ఆమె వెంట వైద్యులు సుదేష్ణ , నారాయణ , జానకి , ఫార్మసిస్ట్ వెంకట్ రాంరెడ్డి , డీపీఎంవో భిక్షపతి , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.