అచ్చంపేట రూరల్, అక్టోబర్ 8 : కడుపునొప్పితో బాధపడుతున్న మహిళను కూతురు ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యం చేయించగా.. బిల్లు విషయంలో మాటామాటా పెరిగి.. దాడికి కారణమైన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. బల్మూరు మండలం కొండనాగుల గ్రామానికి చెందిన లింగమ్మ కడుపునొప్పితో బాధపడుతుండగా.. మూడ్రోజుల కిందట ఆమె కూతు రు అచ్చంపేటలోని ఓ ప్రైవే టు దవాఖానలో చేర్పించింది.
అక్కడి డాక్టర్ శివ ఆమెను పరీక్షించి నొప్పికి సంబంధించి పలు టెస్టులు చేయించాలని రోగి బంధువుకు సూచించాడు. ల్యాబ్లో టెస్టులు చేయించగా వైద్యం, పరీక్షలకు కలిపి మొత్తం రూ.1,500 చెల్లించాలని మంగళవారం దవాఖాన సిబ్బంది సూచించారు. దీంతో రోగి బం ధువు తమ వద్ద రూ.1,000 మాత్రమే ఉన్నాయని, మిగితా రూ.500 తర్వాత చెల్లిస్తామని చెప్పింది. దీంతో ఓపీ రాసే కార్తీక్ ఆమెపై దాడికి దిగాడు. ఆమె చేతి చేతిని మెలికలు తిప్పడంతో చేతికున్న గాజులు కుచ్చుకొని రక్తస్రావమైంది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు కోరుతున్నారు. ఈ విషయమై ప్రైవేటు దవాఖాన డాక్టర్ శివను వివరణ కోరగా.. రోగి బంధువుకు చికిత్స చేయగా.. రూ. 1,500 బిల్లు అయ్యిందన్నారు. అయితే వారు రూ.వెయ్యి మాత్రమే ఇచ్చి తగ్గించాలని సిబ్బందితో గొడవకు దిగారని చెప్పారు.