నారాయణపేట, మార్చి 18 : పండుగ వస్తుందంటే చాలు అందరూ ఆ హ్యాపీ క్షణాల కోసం ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తుంటారు. దగ్గర పడుతుందంటే ఇళ్లకు సున్నాలు, రంగులు వేయడం దగ్గరి నుంచి కొత్త బట్టలను కొనుగోలు చేయడంలో హడావిడిగా కనిపిస్తుంటారు. ఇక పండుగ రోజు చేసే తీపి వంటలతో ఆ మరునాడు జరుపుకొనే కరి పండుగలో మాంసాహార వంటకాలతో చిన్న నుంచి పెద్ద వరకు కుటుంబ సభ్యులు ఆప్యాయంగా గడుపుతుంటారు. కానీ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఉటూరు మండలం పెద్దజట్రం గ్రామంలో మాత్రం పండుగ వస్తుందంటే చాలు ఓ సామాజికవర్గం ఏ క్షణానా.. ఏ అశుభం వార్త వినాల్సి వస్తుందనే భయం భయంతో గడుపుతుంటారు.
పది కాదు ఇరవై కాదు ఏకంగా 150 గడపలు.. దాదాపు 500 మంది కుటుంబ సభ్యులను ఏళ్ల తరబడిగా కలవర పెడుతున్న ఘటన వివరాల్లోకి వెళితే.. ఏదైనా పండుగ దగ్గర పడుతుందనే చాలు పెద్దజట్రం గ్రామంలోని ఓ సామాజిక వర్గంలో ఎవరైనా ఒకరు మృతి చెందుతున్న సంఘటనలు ఏళ్ల నుంచి కొనసాగుతోంది. గ్రామంలోని మాల కుటుంబాలు దాదాపు 150 వరకు ఉన్నాయి. ఏడాదిలో ఏ పండుగ వచ్చినా ఈ కుటుంబాల్లో ఒకరు చనిపోతుంటారు.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏండ్ల తరబడి కొనసాగుతుంది. చిన్న నుంచి పండు ముసలి వరకు ఇలా ఎవరైనా సరే సాధారణంగానైనా? లేదా మరే విధంగానైనా ఎవరో ఒకరు చనిపోతుంటారు.
పండుగ పూట ఊరిలో మిగతా కులస్తులు సంబురాలు చేసుకుంటూ ఆనందంగా గడుపుతుంటే.. ఈ సామాజిక వర్గం మాత్రం విషాదంలో గడుపుతున్న పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో కుల పెద్దలు తాము, తమ సామాజిక వర్గానికి చెందిన కుటుంబ సభ్యులు ఎన్నో ఏండ్లుగా పడుతున్న బాధ నుంచి విముక్తి కలగాలంటే గ్రామంలోని యావత్తు మాల సామాజికవర్గంలోని చిన్న మొదలు పెద్దల వరకు తమ కుల దైవమైన ఆలయంలో ఓ రోజు నిద్ర చేసి, ఆవు కోడెను ఆలయంలో ఇచ్చి మొకి రావాలని.. ఎన్నో ఏళ్ల నుంచి మీ పూర్వీకుల మొకు పెండింగ్‌లో ఉందని, తీర్చుకోవాలని ఇటీవల ఓ స్వామీజీని సంప్రదించగా చెప్పినట్లు తెలిసింది. దీంతో పూర్వీకుల మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించారు.
ఇందుకయ్యే ఖర్చుల కోసం కుటుంబ పెద్దలు ఒకో గడప నుంచి రూ.300 చొప్పున పోగు చేసి, రవాణా, భోజన, పూజల వంటి సదుపాయాలకు ఏర్పాట్లు చేశారు. సదరు సామాజిక కులానికి చెందిన వారు కుటుంబ సభ్యులతో కలసి ఇళ్లకు తాళాలు వేసి నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ గ్రామంలోని గుట్టపై వెలసిన శ్రీ తిమ్మప్పస్వామి ఆలయం ఆవరణలో మంగళవారం రాత్రి నిద్ర చేశారు. బుధవారం ఉదయమే స్నానాలు ఆచరించి దేవుడిని దర్శించుకొని, ఆవు కోడెను ఆలయంలో అప్పగించారు. అనంతరం అకడే వంటలు చేసుకొని భోజనాలు చేసి తమ తమ ఇండ్లకు తిరిగి వచ్చారు. స్వామి అనుగ్రహంతో వారు పడుతున్న బాధ నుంచి ఇప్పటికైనా విముక్తి కలగాలని ఆశిద్దాం.
పెద్దజట్రం గ్రామంలోని 7వ, 8వ, 9వ వార్డుల్లోని మాల కులస్తులు అందరూ తమ కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దలు కూడా ఇల్లు వదిలి తమ ఇలవేల్పు లోకపల్లి తిమ్మప్ప స్వామికి వెళ్లడంతో రాత్రి గ్రామ పోలీస్ అధికారి దేవేందర్, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామ సర్పంచ్ వాకిటి వెంకటేశ్, వార్డు సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, సోమేశ్వర్‌రెడ్డి, యువకులు దొంగతనాలు చోటు చేసుకోకుండా గస్తీ చేపట్టారు.