దోమలపెంట, జనవరి 8 : అమ్రాబాద్ మండలం దోమలపెంటలో గత నెల 11వ తేదీన పంచాయతీ కార్యదర్శి జేసీబీని పెట్టి బస్టాండ్ పక్కన ఉన్న కటకం నాగలక్ష్మి, దర్గా ఎదురుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఉపసర్పంచ్ కటకం మహేశ్ దుకాణాలు కూల్చివేశారు. అయితే దుకాణాలు కూల్చివేసిన స్థలం విషయంలో బాధితుడు అప్పటికే హైకోర్టును ఆశ్రయించగా కోర్టు పంచాయతీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కడైతే బాధితుడికి చెందిన నిర్మాణం కూల్చి వేశారో అక్కడ వెంటనే నిర్మాణం చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
దీంతో పంచాయతీ అధికారులు బాధితుడు మహేశ్‌కు రెండు వారాల్లో కట్టిస్తామని హామీపత్రం రాసిచ్చారు. రెండువారాల గడువు ముగుస్తున్నా రెండు రోజులు మాత్రమే పనులు చేసి చేతులు దులుపుకున్నారు. అంతేకాకుండా అధికారులు షాపుల నిర్మాణానికి మరో రెండు వారాలు గడువు కావాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు.ఈ సందర్భంగా బాధితులు మహేశ్ మాట్లాడుతూ న్యాయస్థానంలో కేసు నడుస్తున్నదని మా దుకాణాలు కూల్చవద్దని వేడుకున్నా పంచాయతీ అధికారులు వినకుండా కూల్చివేశారని ఆరోపించారు. కూల్చివేయడంలో ఉన్న శ్రద్ధ నిర్మించడంతో మాత్రం చూపించడం లేదని వాపోతున్నారు. అధికారుల నిర్వాకం వల్ల మేము ఉపాధిని కోల్పోయి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.