మహబూబ్ నగర్ కలెక్టరేట్, జూన్ 21: శరీరాన్ని, మనసును ఏకం చేసే అద్భుత సాధనం యోగా అని పాలమూరు యూనివర్సిటీ (Palamuru University ) వీసీ ఆచార్య జీవీ శ్రీనివాస్ అన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశమని చెప్పారు. పాలమూరు వర్సిటీలో ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో వీసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనిష్ట, మధ్యమ, జేష్ట ప్రాణయమాలు చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. యోగా, మెడిటేషన్ ద్వారా శరీరంలో ప్రతి కణం ఉత్తేజమవుతుందన్నారు. తద్వారా రక్తప్రసరణ అన్ని భాగాలకు జరిగి మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. రోజువారి కార్యక్రమాలలో బిజీ జీవితాన్ని గడుపుతున్న వారికి యోగా మెడిటేషన్ ద్వారా ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ఉచ్ఛ్వాస నిఛ్వాస క్రమబద్ధతిలో ఉండాలన్నారు.
192 దేశాలు ఏకగ్రీవంగా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ఆమోదించాయని, ఇది భారతీయులందరికీ గర్వకారణమని రిసోర్స్ పర్సన్ డాక్టర్ చంద్ర కిరణ్ అన్నారు. సూక్ష్మవ్యాయామాలు చేయడం ద్వారా శరీరాన్ని యోగాకు అనుకూలంగా మలచుకోవచ్చని తెలిపారు. వృక్షాసనం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, త్రికోణాసనం ద్వారా నడుము భాగంలో ఉన్న చెడు కొవ్వు కరుగుతుందని, నౌకాసనం ద్వారా ఉదరం కండరాలు బలపడతాయని, సేతు బంధు ఆసనం ద్వారా వెన్ను నొప్పి తగ్గుతుందని వెల్లడించారు. శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానమని, ధ్యానం ద్వారా ఉచ్చ స్థితిలోకి చేరుకోవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారి, కోఆర్డినేటర్ డాక్టర్ కే. ప్రవీణ, ప్రిన్సిపాల్స్ డాక్టర్ రవికాంత్, డాక్టర్ కరుణాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణయ్య, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రవికుమార్, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ గాలన్న, డాక్టర్ ఈశ్వర్ కుమార్, డాక్టర్ చిన్నా దేవి, డాక్టర్ శివకుమార్ సింగ్, డాక్టర్ జ్ఞానేశ్వర్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు.