మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 28 : అధికారుల అనాలోచిత నిర్ణయం తో పాలమూరు పట్టణంలో రైల్వే లైన్ పనులు కోసం పేదలు ఇండ్లను కోల్పోతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని మదీన మసీదు ప్రాంతంలో ఇండ్లు కోల్పోయిన కుటుంబాలను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ కేంద్ర మంత్రి ఉన్న సమయంలోనే పాలమూరు జిల్లాకు రైల్వే డబుల్ లైన్ ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తు చేశారు.
రైల్వే అధికారులు చేపడుతున్న డబుల్ లైన్ పనుల విషయంలో ఎలాంటి అభ్యంతరంలేదు. కానీ అధికారులు అనాలోచితంగా ఆలోచన చేస్తున్నారని అన్నారు. రెండు వైపుల తొమ్మిది మీటర్లు తీసుకుంటే సమస్యలేదు. కానీ ఒకవైపు ఎక్కువ మరో వైపు తక్కువ తీసుకొంటున్నారు. వ్యాపా రం చేసుకునే వారికి కూడా అధికారుల చర్యలతో నష్టం కలుగుతుందన్నారు. పేదలు తమ ఇళ్లలోకి వెళ్లకుండా మార్గాలు మూసివేసి ఇబ్బందులకు గురిచేసి కరెంట్ తొలిగిస్తున్నదని, ఇది సరైన పద్ధతికాదన్నారు. రెండు వైపుల తొమ్మిది మీటర్ల జాగా తీసుకుంటేనే డబుల్ లైన్లో రైళ్లు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది కానీ అధికారులు అనవసరంగా పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ప్రజల సహకారం లేనిదే మీరు పనులు చేయగలరా అంటు మండిపడ్డారు. పేదల ఆస్తులు కూలగొట్టి ఇబ్బందులు పెట్టినా ఎవరూ పట్టించుకోరని అధికారులు అనుకుంటున్నారు. అవసరమైతే ప్రజలకు న్యాయం జరిగేందుకు ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు. 2002లో ఇదే విధంగా అధికారులు వస్తే ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించామని గుర్తుచేశారు. కార్యక్రమంలో ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.