మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 10 : కాంగ్రెస్ సర్కారు తన మేనిఫెస్టోలో యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ పిలుపు మేరకు గురువారం విధులు బహిష్కరించి పీయూ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం పీయూ ప్రధాన ముఖద్వారం ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా పీయూటీఏ నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1,270 మంది ఒప్పంద అధ్యాపకులను బేషరతుగా పర్మినెంట్ చేయాలని, జీవో 21 వెంటనే రద్దు చేసి తమకు న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతుంటే అధ్యాపకులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించడం ఎంత వరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు అర్జున్‌కుమార్, శ్రీధర్రె డ్డి, సిద్ధ్దారెడ్డి, పర్వతాలు, సుదర్శన్‌రెడ్డి, వెంకటేశ్, రవికుమార్, ప్రదీప్, విజయభాస్కర్, ప్రభాకర్‌రెడ్డి, రామ్మోహన్, భూ మయ్య, జ్ఞానేశ్వర్, జిమ్మికార్టన్, శైలేశ్, సురేశ్ పాల్గొన్నారు.