మహబూబ్ నగర్ : రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తోడుగా రైతుల్లో భరోసా కల్పించేందుకు త్వరలో పాదయాత్ర ( Padayatra ) నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) వెల్లడించారు. మహబూబ్ నగర్ మండల పరిధిలోని రాంరెడ్డి గూడెం మిల్లు వద్ద ధాన్యం బస్తాల వద్ద రైతులను కలిసి మాట్లాడారు.
రైతులకు అనేక హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరిస్తామని పేర్కొన్నారు. రైతులకు గిట్టు బాటు ధర ఇవ్వాలని, సకాలంలో యూరియా, కరెంటు, రైతు బంధుఇవ్వాలని, పండించిన పంట సకాలంలో కొనుగోలు చేయడంతో పాటు మద్దతు ధర కల్పించాలని కోరనున్నట్లు ఆయన వివరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే డిమాండ్ల తో పాదయాత్ర చేపడుతామని, ఇందుకోసం పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళికను విడుదల చేస్తామన్నారు.
ప్రజా సమస్యలు వదిలేసి సర్పంచ్, కార్పొరేటర్లు, నాయకులను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తుందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. బీఆర్ఎస్ వరంగల్ సభ పెడుతున్నట్టు ప్రకటన వచ్చిన వెంటనే పాత పద్దతిలో పంట కొనుగోళ్లు ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం కారణంగా రైతుల నుంచి మిల్లర్లు ఎక్కువ తరుగు తీస్తున్నారని ఆరోపించారు.
ఆయన వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఆంజనేయులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు శివరాజ్, తదితరులు పాల్గొన్నారు.