గద్వాల, అక్టోబర్ 18 : ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే అభివృద్ధి చేసే వారికి పట్టం కడతారని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో కేటీదొడ్డి మండలం రంగాపురం, రంగాపురం తండా, ఇర్కిచేడ్ తండా, వాగుతండా, గువ్వలదిన్నె, యర్సన్‌దొడ్డి, ధరూర్ మండలం కొత్తపాలెం తండాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు 150మంది పైగా బుధవారం తమ పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. గత పాలకుల వల్లే తండాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయన్నారు. స్వరాష్ట్రంలో తండాలను పంచాయతీలుగా గుర్తించి వారికే అధికారం కట్టబెట్టారని వివరించారు. కొంతమంది టూరిస్టు నాయకులు కులం పేరుతో, మతం పేరుతో ఓట్ల కోసం వస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించి మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్, సర్పంచులు జయమ్మ, తిక్కన్న, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, నాయకులు సురేశ్, చక్రధర్‌రావు, విక్రమసింహారెడ్డి, రాజేశ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.