మాగనూరు : ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతన్నలు ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో అరిగొస పడుతున్నారు. పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక వర్షాలకు తడిసి ఇబ్బంది పడుతుంటే మరోవైపు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ( Congress Member) అందుబాటులో లేడన్న కారణంతో కొనుగోలు కేంద్రం( Purchase Centre) ప్రారంభాన్ని వాయిదా వేయడం చర్చాంశనీయంగా మారింది.
నారాయణపేట జిల్లా మాగనూరు ( Maganoor ) మండల పరిధిలోని ఉజ్జలి గ్రామంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఏర్పాట్లు చేశారు. మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కవినోళ్ల రాధమ్మ భర్త లక్ష్మారెడ్డి నేరడగం గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అక్కడి నుంచి ఉజ్జలి గ్రామంలో నెలకొల్పిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు.
అయితే ఉజ్జలి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శ్రీనివాస్ రెడ్డి గ్రామంలో అందుబాటులో లేడన్న సమాచారం మేరకు కొనుగోలు కేంద్రాన్ని మరుసటి రోజుకు వాయిదా వేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇదే విషయం మహిళా సమైక్య ఏపీఎం ఆంజనేయులు వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల లేడన్న కారణంతోనే మార్కెట్ కమిటీ చైర్మన్ ఆదేశాల మేరకు ప్రారంభాన్ని వాయిదా వేశామని స్పష్టం చేశారు.