వానకాలం మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుంది. జూన్ మొ దటి వారంలోనే నైరుతి రుతుపవనాలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. దీంతో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. వర్షాలు మొదలైతే ఈ రెండు నదుల్లో నీటిమట్టాలు క్రమంగా పెరుగుతాయి. గతంలో వచ్చిన వరదను వచ్చినట్లుగా ఆయా ప్రాజెక్టులకు మళ్లించి రిజర్వాయర్లలో నిల్వ చేసేవారు. ఈసారి ప్రధాన కాల్వలతో పాటు రిజర్వాయర్ల నుంచి వెళ్లే కాల్వలన్నీ అధ్వానం గా మారాయి.
అందుకు తోడుగా ఈ ఎండాకాలం రిపేర్లు చేయకపోవడంతో కాల్వలకు గండ్లు పడే అవకాశం ఉందని రైతాంగం ఆందోళన చెందుతున్నది. నీటి ప్రవాహం తగ్గి రిజర్వాయర్లు నిండవని.. ఫలితంగా కాల్వలపై ఆధారపడిన వేలాదిమంది రైతులు గోసపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజమైతే సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతుంది.
ఇప్పటికే గత యాసంగిలో రైతులు చాలా నష్టపోయారు. కృష్ణానదిలో నీటి నిల్వలు ఉన్నా పక్కనున్న ఆంధ్ర రాష్ర్టానికి భయపడి రేవంత్ సర్కార్ ఈ ఆరు నెలల్లో చుక్క నీటిని కూడా ఉమ్మడి జిల్లాకు తరలించలేదు. కనీసం తాగునీటికి కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి నీటిని వాడుకునే సాహసం చేయలేదు. ఫలితంగా సాగు, తాగునీటి ఎద్దడి నెలకొన్నది. వర్షాకాలం సమీపిస్తున్నా ప్రాజెక్టులు రిపేర్లకు నోచుకోకపోవడం, కాల్వలు అధ్వాన స్థితికి చేరడంతో సాగునీటి ఎద్దడి తప్పదని ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సొంత జిల్లాపై సీఎం సవతి ప్రేమ చూపకుండా ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.