
సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేడుకల్లో సీఎం కేసీఆర్ పలువురిని సన్మానించనున్నట్లు చెప్పారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేసేందుకు శ్రమించాలని కోరారు. గ్యాలరీలు, ఎల్ఈడీ తెరల ఏర్పాటు, స్వాగతతోరణాల వంటి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్, ఐఏఎస్ అధికారులు నదీం అహ్మద్, విజయ్ కుమార్, హరివిందర్సింగ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ చౌహాన్, ఉత్సవ కమిటీ సభ్యులు రాయడిన్ రోచ్, రాజీవ్ సాగర్, శంకర్ లూక్, పోలీస్, రెవెన్యూ, వైద్యారోగ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.