మహబూబ్‌నగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 30 : రూ.లక్షల్లో జీతాలు.. బాధ్యతాయుతమైన ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. ఇవన్నీ ఉన్నప్పటికీ కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దె కార్ల దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. ట్యాక్సీ వాహనం పేరిట ప్రతి నెలా బిల్లులు కాజేస్తూ ఖజానాకు గండికొడుతున్నారు. ప్రభుత్వ అధికారులు పర్యటించేందుకు సొంత వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో.. అవసరమైన వాటిని అద్దెకు తీసుకొనే వెసులుబాటును ప్రభు త్వం కల్పించింది. అందుకోసం ఒక్కో వాహనానికి నెలనెలా రూ.33 వేలు అద్దె చెల్లించేందుకు ఆదేశాలున్నాయి.
బ్యాంకు రుణాలు, రాయితీ, కార్పొరేషన్లతోపాటు ఓనర్ కం డ్రైవర్ వంటి పథకాలను ప్రవేశపెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు వారిని ప్రోత్సహించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. జిల్లావ్యాప్తంగా కొందరు అధికారులు సొంత వాహనాలు, తమ బంధువులకు సంబంధించిన వాటిని బినామీ పేర్లతో అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్నారు. వీటికి కనీసం ట్యాక్సీప్లేట్ ఉండాలన్న విషయాన్ని కూడా వారు పట్టించుకోవడం లేదు. బినామీ పేర్లతో నెలనెలా బిల్లులు తీసుకుంటూ నిరుద్యోగుల ఉపాధిపై నీళ్లు చల్లుతున్నారు. జిల్లాలోని మండలాల తాసీల్దార్లతోపాటు ఎంపీడీవోలు, జిల్లాలో వివిధ శా ఖల అధికారులు సైతం అద్దె కార్ల దందాను కొనసాగిస్తుండడం గమనార్హం.
అధికారులకు సంబంధించిన వాహనాలపై ‘ఆన్ గౌట్ డ్యూటీ’ పేరిట తెల్ల నెంబర్ ప్లేట్లు ఉంటున్నాయి. ఇలాంటి వాహనాలు ప్రభుత్వ పనుల కోసం రోడ్లపై తిరుగుతున్నా.. రవాణాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత వాహనాలకు బిల్లులు పెట్టుకోవడం సాధ్యం కాకపోవడంతో సదరు అధికారులు ట్యాక్సీప్లేట్ కలిగిన వాహనాదారులతో కమిషన్ మాట్లాడుకొని అద్దె కార్ల దందాను నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కోఆపరేటీవ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ముఖ్య ప్రణాళిక, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, హౌసింగ్, ఆర్అండ్బీ, డీఆర్డీఏ, ఇరిగేషన్ వంటి ప్రధాన శాఖల్లోనూ బినామీ పేర్లతో అద్దె వాహనాలు కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, ఈ విషయంపై కలెక్టర్, ఉన్నతాధికారులు చర్యలు తీ సుకోవాలని తెలంగాణ ఫోర్ వీలర్స్ డైవర్స్ హైర్ వెహికిల్స్ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్ ఏవో శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందిస్తూ త్వరలో సమగ్ర నివేదికలు సేకరించి చర్యలు సేకరిస్తామని పేర్కొన్నారు.